- నాపై చర్యలుతీసుకున్నా సరే.. ప్రశ్నించక మానను
- మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదన
జగిత్యాల, వెలుగు: నాలుగు దశాబ్దాలు పార్టీ సేవ చేయడమే తాము చేసిన పాపమా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ టికెట్లపై పార్టీ నాయకత్వం నిర్ణయాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసిన నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టి, ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారికి బీ- ఫామ్‌లు ఇవ్వడం క్రమశిక్షణను దెబ్బ తీస్తుందన్నారు. మంగళవారం జగిత్యాల కాంగ్రెస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉన్న నాయకులను కాదని వలస వాదులు, అవకాశవాదులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం అన్యాయమన్నారు.
తాను 50 మంది కార్యకర్తల పేర్లను సూచిస్తే అందులో చాలా కొద్దిమందికే అవకాశం ఇవ్వడం పార్టీకి నష్టం చేస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, బీ-ఫారాల పంపిణీ సరిగా జరగలేదని, మున్సిపల్ అధికారులు ఫైనల్ లిస్ట్ ప్రకటించే వరకు కాంగ్రెస్ అభ్యర్థులెవరో ప్రజలకు తెలియదని, ఇది పార్టీలో గందరగోళం పెంచుతుందన్నారు.
రాయికల్ లో కాంగ్రెస్ జెండా మోసినవారికి కాకుండా సగానికి పైగా కొత్తవారికి టికెట్లు ఇచ్చారని, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా బరిలోంచి తప్పుకోవాల్సిరావడం దారుణమన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరుపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ స్పీకర్‌కు అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి కాంగ్రెస్ అంతర్గత సమావేశాల్లో పాల్గొనటం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమన్నారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ప్రశ్నలు లేవనెత్తక తప్పడంలేదన్నారు. ఈ పరిణామాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
