జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ డబ్బు రూట్​ మారింది

జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ డబ్బు రూట్​ మారింది
  • ఈవై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ లో వెల్లడి
  • బిల్లింగ్‌ , ఇన్వాయిస్‌‌లలో అవకతవకలున్నాయ్‌
  • ఇంధన ధరలనూ పెంచి చూపించారు

ముంబై : జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ నిధుల మళ్లింపునకు పాల్పడిందని స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌బీఐ) నిర్వహించిన ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో తేలింది. అప్పులకు సంబంధించిన ప్రొవిజన్లు, జెట్‌‌ ప్రివిలైజ్‌‌ మైల్స్‌‌ బిల్లింగ్‌‌లో మోసాలు జరిగాయని ఆడిట్‌‌లో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్వాయిస్‌‌ల తనిఖీ సరిగా లేదని, దాంతో అధిక బిల్లింగ్‌‌ నమోదైందని, ఇతర ఎయిర్‌‌లైన్స్‌‌కు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌కే అధికమైనట్లు కూడా ఈ ఆడిట్‌‌లో తేలింది. నాలుగేళ్ల కాలంలో జెట్‌‌ లైట్‌‌కు ఇచ్చిన అప్పుల మొత్తం రూ. 3,353 కోట్లకు ప్రొవిజనింగ్‌‌ చేశారు. ఐతే, దీనికి సంబంధించిన బోర్డ్‌‌ రిజొల్యూషన్‌‌, షేర్‌‌ హోల్డర్ల ఆమోదం ఆడిటర్లకు అందించలేదని ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌ చేసిన ఈవై తెలిపింది.2015 నుంచి తానే నష్టాలలో ఉన్నప్పటికీ, జెట్‌‌ లైట్‌‌కు జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ అప్పులివ్వడం గమనార్హమని రిపోర్టు పేర్కొంది.

ఆర్థికపరమైన అక్రమాలు, నిధుల మళ్లింపులపై ఆరోపణలతో  జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు చేపట్టాల్సిందిగా సీరియస్‌‌ ఫ్రాడ్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీస్‌‌ (ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ)కు ఎంసీఏ ఉత్తర్వులు ఇచ్చింది. జెట్‌‌ ప్రివిలైజ్‌‌ ఇన్వాయిస్‌‌లను తనిఖీ చేయలేదని, ఫలితంగా జూలై–సెప్టెంబర్‌‌ 2015 మధ్య కాలంలో రూ. కోటి అధిక బిల్లింగ్‌‌ జరిగిందని ఫోరెన్సిక్‌‌ రిపోర్టులో వెల్లడైంది. కమర్షియల్‌‌ యాక్టివిటీస్‌‌ కోసం నెల నెలా రూ. 15 కోట్లను ఇన్వాయిస్‌‌ చేశారని, ఐతే వాటికి ఎలాంటి డాక్యుమెంట్లూ లేవని తెలిపింది. రూ. 140 కోట్ల విలువైన జెట్‌‌ ప్రివిలైజ్‌‌ మైల్స్‌‌ బిల్లింగ్‌‌ మోసపూరితంగా జరిగిందని, అందువల్ల కంపెనీకి రూ. 46 కోట్ల నష్టం వాటిల్లిందని రిపోర్టు పేర్కొంది.  పరిమిత విశ్లేషణలోనే అనేక పొరపాట్లు, తప్పులు దొరికాయని, నిధులు మళ్లించినట్లు స్పష్టమైందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ నుంచి డబ్బు తీసుకోవడానికి వివిధ మార్గాలు అనుసరించినట్లు తేటతెల్లమైందన్నారు. ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌ రిపోర్టు మీద వివరణ కోరగా ఎస్‌‌బీఐ స్పందించలేదు. క్లయింట్‌‌తో ఉన్న ఆబ్లిగేషన్ కారణంగా తామేమీ మాట్లాడలేమని ఈవై తెలిపింది.