పవన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..కమ్యూనిజంపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: జాన్ వెస్లీ

పవన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..కమ్యూనిజంపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: జాన్ వెస్లీ

హైదరాబాద్​, వెలుగు:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమ్యూనిజం, ప్రజా పోరాటాలపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ విద్వేషాలను, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ పోరాటాలను అవమానించేలా మాట్లాడటం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి తగదన్నారు. తనపై వచ్చిన 10 ఎకరాల చెరువు భూమి ఆక్రమణ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవడానికి లేదా ఇతర ప్రజా సమస్యలపై మాట్లాడటానికి పవన్‌‌‌‌కు పూర్తి హక్కు ఉందన్నారు. కానీ, సీపీఎం పార్టీ తెలంగాణను వ్యతిరేకించిందంటూ అవాస్తవాలతో బురదజల్లడం తనపై వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని పేర్కొన్నారు. కమ్యూనిజం చచ్చిపోయిందనడం, పవన్  రాజకీయ అజ్ఞానాన్ని, అవివేకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. 

ప్రపంచంలో పెట్టుబడిదారులు, దోపిడీ వర్గాలు ఉన్నంత కాలం శ్రామికవర్గాల తరఫున ఎర్రజెండా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కేవలం కొన్నిచోట్ల పదవులు లేదా ప్రభుత్వాలు కోల్పోయినంత మాత్రాన సిద్ధాంతం నశించిపోదని, ఈ దేశంలోని దోపిడీవర్గాలకు వ్యతిరేకంగా, కుల, మత, ప్రాంతాలకతీతంగా శ్రామికవర్గాల రాజ్య స్థాపన కోసం పోరాడుతున్న పార్టీ సీపీఎం అన్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. పవన్ పూర్తిగా బీజేపీ,  ప్రధాని మోడీ ఎజెండాకు అనుగుణంగా మతోన్మాద, విద్వేష రాజకీయాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.