హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ (ఏహెచ్‌పీసీ) కోసం పూర్తిస్థాయి స్టేట్ కౌన్సిల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని జాయింట్ ఫోరమ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం ఫోరమ్ ప్రతినిధులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ ) డాక్టర్ నరేంద్ర కుమార్, పారామెడికల్ బోర్డ్ జాయింట్ డైరెక్టర్ బి. ప్రేమ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోరమ్ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అలైడ్ హెల్త్ కేర్ కౌన్సిల్ ఏర్పాటు ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కౌన్సిల్ లేకపోవడం వల్ల వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. త్వరలోనే హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించి కౌన్సిల్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని డీఎంఈ హామీ ఇచ్చారని ఫోరం సభ్యులు వెల్లడించారు. కేంద్రస్థాయిలో నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ (ఎన్‌సీఏహెచ్‌పీ) పురోగతిపై జాయింట్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ క్లారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ ఫోరం ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ప్రధాన కార్యదర్శి రవిందర్ మంచాల, కె. నాగరాజు, కె. విజయ్ కుమార్, దామోదర నాయుడు, పి. విజయేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

