అబిడ్స్, వెలుగు: పాత్రికేయుల సంక్షేమంతో పాటు ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆఫీసులో శనివారం అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 10వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
పాత్రికేయ వృత్తి ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాకు సూచించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎం.ఏ. మాజిద్‌తో పాటు ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌తో కలిసి ఉర్దూ జర్నలిజంలో విశిష్ట సేవలందించిన పాత్రికేయులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
