ముంబైని గుర్తుచేసే ఈ కారు ఇక కనపడదు

ముంబైని గుర్తుచేసే ఈ కారు ఇక కనపడదు

ఆ టాక్సీని చూస్తేనే ముంబై గుర్తొస్తుంది. ముంబైకి ఎవరైనా వెళ్లొస్తే.. ఆ క్యాబ్ లో ప్రయాణించని వారు అరుదు. సినిమాల్లోనూ.. ముంబై నేపథ్యాన్ని చూపించాలంటే.. ముందు అదే కారును చూపిస్తుంటారు. ఆ కారే.. ప్రీమియర్ పద్మిని టాక్సీ. ముంబైలో సగటు మనిషి మాత్రం దాన్ని కాలీ పీలీ టాక్సీ అని పిలుస్తుంటారు. బ్లాక్ అండ్ యెల్లో కలర్ లో ఉండే ఈ టాక్సీ వచ్చే ఏడాది జూన్ నుంచి ఇక నుంచి రోడ్డెక్కదు.

ముంబైలో 1960స్ నుంచి .. 1990స్ వరకు… కాలీపీలీ టాక్సీదే హవా. ఢిల్లీ , కోల్ కతా లాంటి ప్రధాన నగరాల్లో అంబాసిడర్ కారు రోడ్లను ఏలుతున్న రోజుల్లో.. ముంబైలో రోడ్లపై దుమ్ములేపింది Fiat 1100 Delight కారు. 1964లో ముంబైలోని ప్రీమియల్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ కంపెనీ.. ఇటాలియన్ కార్ల కంపెనీ ఫియట్ తో ఒప్పందం చేసుకుని పద్మిని ప్రీమియమ్ కారును తయారుచేసింది. అప్పటికే దేశంలో ప్రముఖంగా ఉన్న హిందూస్థాన్ మోటర్స్ వారి ‘అంబాసిడర్’ కార్లను కాదని… పద్మిని ప్రీమియర్ లను బుక్ చేసుకున్నారు ముంబై అఫీషియల్స్.

ముంబైలో అధికారులు అప్పట్లో వాడిన ఆ కారే… ఆ తర్వాత ఐకానిక్ కారు అయిపోయింది. ఆ కారెక్కితే అప్పట్లో వారికి ఉండే ఫాలోయింగే వేరు. గొప్పగా చెప్పుకునేవారు. ప్రీమియం లగ్జరీ కారుగా పేరుండేది. ఆ తర్వాత.. సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ముంబైలో నివసించేవారికి.. ఈ టాక్సీతో చెప్పలేనంత కనెక్టివిటీ ఉంటుంది. ఒకానొక సమయంలో ఈ కాలీ పీలీ టాక్సీనే వారికి లైఫ్ లైన్ గా మారిపోయింది. 1990ల మధ్యలో 65వేల కార్లు ముంబైలో తిరిగేవి. ఇదే ఈ కాలీ పీలీ పద్మినీ చేసిన పీక్ జర్నీ.

పదుల సంఖ్యలో కొత్త క్యాబ్ సర్వీసులు, పర్యావరణానికి మేలు చేసే మోడల్స్ రాకతో .. టాక్సీ రంగాన్ని డామినేట్ చేసిన పద్మినీ కార్లు క్రమంగా తగ్గిపోయాయి. ఇపుడు 50 కూడా ముంబైలో లేవు. వెల్లువలా పుట్టుకొచ్చిన టాక్సీల కాంపిటీషన్ లో ఈ లెజెండరీ ప్రీమియం కారు ఆదరణ తగ్గింది. ఈ మోడల్ తయారీని కంపెనీ 2000లోనే ఆపేయడం.. స్పేర్ పార్ట్స్, టైర్స్, రిపేరింగ్ టూల్స్ దొరక్కపోవడంతో … ఈ టాక్సీని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు ముంబై టాక్సీ మెన్ యూనియన్ నాయకుడు ML Quadros చెప్పారు. ఈ కంపెనీ కార్ల లైఫ్ టైమ్ 20 ఇయర్స్ కావడంతో.. 2020 జూన్ నుంచే వీటిని ఆపేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఈ కారు గురించి తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు కారు వాడినవాళ్లు, దాన్ని నడిపినవాళ్లు. రైడ్ క్వాలిటీ, సస్పెన్షన్, కాళ్లు పెట్టుకోవడానికి స్పేస్.. ఇలా అన్నిరకాలుగా ఈ కారు అనుకూలంగా ఉండేదన్నారు. 2005లో వచ్చిన వరదల్లో చాలా కొత్త మోడల్స్ పాడైపోయాయనీ.. కాలీ పీలీ మోడల్స్ .. ఒక్కరోజులోనే రోడ్డెక్కాయని చెప్పారు. ఈ ముంబై కారు త్వరలోనే హిస్టరీలో కలిసిపోతుందని తెలిసి బాధ కలుగుతోందంటున్నారు ఆ కారుతో జర్నీ చేసినవాళ్లు.