హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. గత నాలుగేండ్లుగా సుమారు 60 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కోర్టు సాక్షిగా ఈ నెల15లోపు బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట తప్పిందన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కాలం నాటి పథకాన్ని మెరుగ్గా అమలు చేస్తామని, నెలకు రూ.200 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపారని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్, రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ హామీలన్నీ నీటి మూటలేనని ఎద్దేవా చేశారు.
ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన ఎంఆర్ఓలు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోకుండా.. అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్న పేదలపై జేసీబీలు ఎక్కించడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థుల బకాయిలు చెల్లించి, కూల్చివేతలు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
