జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నారు.
దర్యాప్తులో మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. కొంతకాలం పాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి, బాధిత మహిళ ఒకే ఇంట్లో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు సీఐ వివిధ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
సీఐ శ్రీనివాసులపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
