మత రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పిది : సిద్ధ రామయ్య

మత రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పిది : సిద్ధ రామయ్య

కాంగ్రెస్​ పార్టీకి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, మత రాజకీయాల్ని ప్రజలు కోరుకోవట్లేదనే దానికి ఇది ఉదాహరణ అని కాంగ్రెస్​​ సీనియర్​ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విక్టరీపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నడ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అగ్రనేత రాహుల్​ గాంధీ పాదయాత్ర గెలువడంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేశారు.  

గతంలో ప్రజా ప్రభుత్వాలను బీజేపీ కూలదోసి అక్రమంగా అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీజేపీ రాజకీయంతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఆపరేషన్​ లోటస్​ పేరుతో 2018 లో సైతం ఇదే తరహా రాజకీయాలు చేశారని చెప్పారు. మరో సారి అలా జరగకుండా కాంగ్రెస్​కే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారని కన్నడ ప్రజలనుద్దేశించి అన్నారు.  ఈ ఎన్నికల ఫలితం లోక్‌సభ ఎన్నికలకు గీటురాయని చెప్పారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తామని, రాహుల్ గాంధీ   ప్రధాని అవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర్పు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా వచ్చిందని అన్నారు.