సుప్రీంకోర్టు 50వ సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు 50వ సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రమాణం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.  ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత న్యాయవ్యవస్థకు చంద్రచూడ్ 50వ ప్రధాన న్యాయమూర్తి.

44 ఏళ్ల క్రితం ఆయన తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేయగా.. ఇప్పుడు ఆయన తనయుడు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. నేటి నుంచి 2024 నవంబర్ 10వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ వైవి చంద్రచూడ్‌ ఫిబ్రవరి 22, 1978 నుంచి జూలై 11, 1985 వరకు సీజేఐగా తన సేవలను అందించారు.   

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడైన డీవై చంద్రచూడ్ 1959 నవంబర్ 11వ తేదీన జన్మించారు. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఆయన 1986 లో హార్వర్డ్ నుండి డాక్టర్ ఆఫ్ జ్యూరిడిషియల్ సైన్సెస్ (ఎస్జేడీ) డిగ్రీ పట్టా పొందారు. జస్టిస్ చంద్రచూడ్ 1998 నుండి 2000 వరకు భారతదేశానికి అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1998లో బాంబే హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన చంద్రచూడ్.. 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు అక్కడే పనిచేశారు. 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి లభించింది. అయోధ్య భూవివాదం, గోప్యత హక్కు, వ్యభిచారానికి సంబంధించిన విషయాలతో సహా... అనేక రాజ్యాంగ బెంచ్‌లు, అత్యున్నత న్యాయస్థానం మైలురాయి తీర్పులలో ఆయన భాగమయ్యారు.