రైతు జలపతిరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి

రైతు జలపతిరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి

జగిత్యాల టౌన్/ జగిత్యాల రూరల్​, వెలుగు:  ఇటీవ ల తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు జలపతిరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థాని కులు నిరసన తెలిపారు. జగిత్యాల–కరీంనగర్ నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. జలపతిరెడ్డి మృతికి కారణమైన అడ్వకేట్ దామోదర్ రావు ను వెంటనే అరెస్టు చేయాలని  డిమాండ్​చేశారు.11 రోజులు అవుతున్నా నిందితుడిని పోలీసులు ఎందుకు అరెస్ట్​ చేయలేదని నిలదీశారు. ఈ సందర్భంగా జలపతిరెడ్డి పెద్ద కూతురు మాట్లాడుతూ.. తన తండ్రి, చెల్లెళ్ల చావుకు కారణమైన అడ్వకేట్ దామోదర్ రావు వెంటనే అరెస్టు చేయాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. 

డీజీపీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

రైతు జలపతి రెడ్డి  బలవన్మరణానికి  కారణమైన అడ్వకేట్ దామోదర్ రావు పై చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకోవాలని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  సోమవారం డీజీపీ అంజన్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. రైతు బలవన్మరణంపై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 4న  కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నిందితుడ్ని అరెస్టు చేయకుండా, విచారణ జాప్యం చేస్తున్నారని వారు డీజీపీకి తెలిపారు.  దామోదర్ రావు మానసిక హింస వల్లనే రైతు జలపతి రెడ్డి సూసైడ్ చేసుకున్నట్లు లేఖ రాయడంతో పాటు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారని,ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.