Orissa High Court: ఒడిశా హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాసిస్ తలపత్రా ప్రమాణస్వీకారం

Orissa High Court: ఒడిశా హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాసిస్ తలపత్రా ప్రమాణస్వీకారం

ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిస్ తలపాత్రా మంగళవారం (ఆగస్టు 8వ తేదీన) ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్ కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించారు. 

జస్టిస్ ఎస్ మురళీధర్ తర్వాత ఒడిశా హైకోర్టు 33వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తలపాత్రా నియమితులయ్యారు. జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌ సోమవారం పదవీ విరమణ చేశారు. అక్టోబరు 3వ తేదీన పదవీ విరమణ చేయడానికి ముందు జస్టిస్ తలపత్రా రెండు నెలల పాటు ఈ పదవిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 4, 1961న త్రిపురలోని ఉదయపూర్‌లో జన్మించిన జస్టిస్ తలపత్రా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్‌, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారు. డిసెంబర్ 21, 2004న సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. జస్టిస్ తలపత్రా నవంబర్ 15, 2011న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో త్రిపురకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టును తన మాతృ హైకోర్టుగా ఎంచుకున్నారు. అక్కడి నుంచి జస్టిస్ తలపత్రా బదిలీ అయిన తర్వాత జూన్ 10 నుంచి ఒడిశా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.