న్యూఢిల్లీ: రిటైర్మెంట్ పొందిన న్యాయమూర్తులు రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదా రాజకీయ నియామకాలను స్వీకరించడం ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధమని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. ఈ ధోరణి అధికార విభజన సిద్ధాంతాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ (ఎన్ఎల్ఐయూ) లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు.
అయితే, ఒక మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రాజ్యసభలో ఎంపీగా చేరడం ద్వారా న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయవచ్చనేది ప్రాథమికంగా తప్పు అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరంగా రెండు వ్యవస్థల మధ్య అలాంటి వారధి అవసరం లేదని.. నియంత్రణలు, -సమతుల్యతలపరిధిలోనే ప్రతి సంస్థ పనిచేయాలని పేర్కొన్నారు. స్టూల్ కాళ్ల ఉదాహరణతో వ్యవస్థల సమతుల్యతను వివరించిన ఆయన.. రెండు కాళ్లను ఒకే చోట ఉంచితే స్టూల్ కిందపడిపోతుందని అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తులు రాజకీయ పదవులు చేపట్టడం వల్ల ప్రభుత్వ విభాగాల మధ్య ఉన్న స్పష్టమైన సరిహద్దులు చెరిగిపోతాయని వివరించారు.
