సీనియర్ సిటిజన్ కమిషన్ చీఫ్ కమి షనర్ గా జస్టిస్ ఉమాదేవి

సీనియర్ సిటిజన్ కమిషన్ చీఫ్ కమి షనర్ గా జస్టిస్ ఉమాదేవి
  •     ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  •     త్వరలో మరో ఇద్దరు కమిషనర్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: సీనియర్ సిటిజన్ కమిషన్ చీఫ్ కమిషనర్ గా జస్టిస్ ఉమాదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం మహిళ స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రుతి ఓజా జీవో 23 విడుదల చేశారు. కాగా ఈ కమిషన్ లో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తామని సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు పదవిలో ఉంటారని జీవోలో స్పష్టం చేశారు.  త్వరలో కమిషన్ గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. 

వయోవృద్ధులైన తల్లిదండ్రులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు  రాష్ర్ట  ప్రభుత్వం తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటెల్ సపోర్ట్ యాక్ట్ 2026 ను ఈ ఏడాది మార్చ్ లో అసెంబ్లీలో ఆమోదించింది. ఈ ఏడాది జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పరిధిలోకి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు,  ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. తల్లిదండ్రుల యోగక్షేమాలను పిల్లలు పట్టించుకోకపోతే నెల జీతంలో 15 శాతం లేదా రూ.10 వేలు మినహాయించి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలన్నది ఈ చట్టం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.