పర్యావరణ సవాళ్లపై వర్సిటీలు పరిశోధనలు చేయాలి : బాలకిష్టారెడ్డి

పర్యావరణ సవాళ్లపై వర్సిటీలు పరిశోధనలు చేయాలి : బాలకిష్టారెడ్డి
  • ఆగస్టు 12, 13 తేదీల్లో కేయూ జాతీయ సదస్సు: బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలను అందించడంలో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ కాకతీయ వర్సిటీ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 12, 13 తేదీల్లో ‘సుస్థిర అభివృద్ధి కోసం సంస్థల సమన్వయం- కాలుష్య నియంత్రణపై బహుళ భాగస్వామ్య విధానం’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మంగళవారం ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో  సదస్సు బ్రోచర్‌‌ను ఆవిష్కరించారు. అనంతరం బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో క్లైమేట్ చేంజ్, సుస్థిర అభివృద్ధి అనేవి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లన్నారు. వాతావరణ మార్పులు, ఎన్విరాన్‌‌మెంటల్ గవర్నెన్స్ వంటి అంశాలపై ఉన్నత విద్యామండలి ఇప్పటికే వినూత్నమైన యూజీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టిందని చెప్పారు.

కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని శాస్త్రవేత్తలు, నిపుణులు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి జి. రవి,  రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రామ్ గోపాల్‌రెడ్డి, జస్టిస్ సాంబశివరావు నాయుడు, ప్రొఫెసర్ దయాకర్, డాక్టర్ బి. దినేష్ కుమార్ పాల్గొన్నారు.