నిధుల్లేక, ప్రొఫెసర్లు లేక ఆగమైన కాకతీయ

నిధుల్లేక, ప్రొఫెసర్లు లేక ఆగమైన కాకతీయ
  • కేయూలో సగానికిగాపైగా టీచింగ్‌‌‌‌, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులు ఖాళీయే
  • పదేళ్లుగా ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ లేకుండానే పాలన
  • జీతాలకు రూ.120 కోట్లు అవసరం.. ప్రభుత్వం ఇస్తున్నది రూ.87 కోట్లే
  • ఉపాధినిచ్చే కోర్సులు కూడా అంతంత మాత్రమే..
  • వివాదాలకు కేంద్ర బిందువుగా పరీక్షల విభాగం
  • వర్సిటీ భూములన్నీ కబ్జాల పాలు

హైదరాబాద్/వరంగల్‌‌‌‌, వెలుగు:

పరిశోధన, అకడమిక్‌‌‌‌ రంగాల్లో జాతీయ స్థాయిలో పేరొందిన కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ట కొన్నేళ్లుగా మసకబారుతోంది. తగినన్ని నిధుల్లేక, బోధించే ప్రొఫెసర్లు లేక, కొత్త ఆవిష్కరణలు ఏవీ రాక నామ్‌‌‌‌కే వాస్తేగా మారిపోయింది. ప్రొఫెసర్‌‌‌‌ జయశంకర్‌‌‌‌, బియ్యాల జనార్దన్‌‌‌‌రావు, బుర్రా రాములు వంటి ఉద్యమ గురువులను అందించిందీ ఈ వర్సిటీయే. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధినేత కేసీఆర్‌‌‌‌ తన దీక్షకు ముందు విద్యార్థులతో నిర్వహించిన సన్నాహక సమావేశానికి వేదికగా నిలిచిందీ ఇదే. రాష్ట్రమొస్తే యూనివర్సిటీకి నిధులొస్తాయని, ఖాళీ పోస్టులు భర్తీ అవుతాయని, విద్య, పరిశోధన రంగాల్లో నాణ్యత పెరుగుతుందని స్టూడెంట్లు, ప్రొఫెసర్లు ఎంతో సంబురపడ్డారు. రాష్ట్రం వచ్చి ఆరేళ్లు దాటినా పరిస్థితి బాగుపడటమేమోగానీ మరింత దారుణంగా మారిపోయింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా ఈ యూనివర్సిటీ ఎన్నో సమస్యలతో సతమతం అవుతోంది. పుట్టెడు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. అత్యున్నత పాలకవర్గమైన ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ (ఈసీ) లేకుండానే పదేళ్లుగా పాలన సాగుతోంది. ఒకప్పుడు కరీంనగర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, ఖమ్మం జిల్లాల పరిధి ఉన్న కాకతీయ వర్సిటీ ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌‌‌‌, ఖమ్మం జిల్లాలకే పరిమితమైంది. వర్సిటీ పరిధిలో 65 కోర్సుల్లో మూడు లక్షల మంది స్టూడెంట్స్‌‌‌‌ చదువుతున్నారు.

ఖాళీగా 252 టీచింగ్‌‌‌‌ పోస్టులు..

యూనివర్సిటీ ఏర్పాటైన తొలినాళ్లలో రిక్రూటైన సీనియర్‌‌‌‌ ప్రొఫెసర్లంతా రెండు, మూడేళ్ల క్రితమే రిటైరయ్యారు. కొన్ని విభాగాల్లో మాత్రమే ఒకరిద్దరు ప్రొఫెసర్లు ఉండగా.. చాలా విభాగాలు అసిస్టెంట్‌‌‌‌, అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్లతోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం వర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్‌‌‌‌, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కళాశాలల్లో నిర్వహిస్తున్న రెగ్యులర్‌‌‌‌, సెల్ఫ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కోర్సులను బట్టి చూస్తే సుమారు1,500 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్లు అవసరం. ప్రభుత్వం రెగ్యులర్‌‌‌‌ కోర్సులకు మాత్రమే 25 ఏళ్ల క్రితం 391 పోస్టులు మంజూరు చేసింది. అందులోనూ 252 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలో పోస్టుల భర్తీకి 2008లో ఇచ్చిన నోటిఫికేషనే చివరిది.

అధ్వానంగా ఇంజనీరింగ్‌‌‌‌ కాలేజీ..

కేయూలో 2009లో ప్రారంభించిన ఇంజనీరింగ్‌‌‌‌ కాలేజీలో బీటెక్‌‌‌‌ సీఎస్‌‌‌‌సీ, ఈసీఈ, ట్రిపుల్‌‌‌‌ఈ, మెకానికల్‌‌‌‌ కోర్సులు ప్రవేశపెట్టారు. తర్వాత ఐటీ, సివిల్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌లతోపాటు ఎంటెక్‌‌‌‌ కోర్సు ప్రారంభించారు. అప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేసే పరిస్థితి లేకపోవడంతో కొత్తగూడెం ఇంజనీరింగ్‌‌‌‌ కాలేజీ నుంచి తొమ్మిది మంది ప్రొఫెసర్లను డిప్యూటేషన్‌‌‌‌పై ఇక్కడికి బదిలీ చేశారు. మరో 30 మంది పార్ట్‌‌‌‌టైమ్‌‌‌‌, కాంట్రాక్టు లెక్చరర్లను నియమించారు. ఉన్న ఇంజనీరింగ్‌‌‌‌ స్టూడెంట్లకే ల్యాబ్‌‌‌‌ సౌకర్యం లేని ఈ క్యాంపస్‌‌‌‌లో 2013లో మహిళా ఇంజనీరింగ్‌‌‌‌ కాలేజీని ప్రారంభించారు. అదే ఏడాది ఇంజనీరింగ్ కాలేజీలో చేపట్టిన 37 ప్రొఫెసర్, అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టుల భర్తీ వివాదాస్పదంగా మారింది. కొందరు క్యాండిడేట్లు కోర్టుకెళ్లడంతో నియామకాలు నిలిచిపోయాయి. ఆ నోటిఫికేషన్‌‌‌‌పై వేసిన జస్టిస్‌‌‌‌ సిద్ధిఖీ కమిటీ కూడా వర్సిటీ తీరును తప్పుపట్టింది. రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఎంపికైనవారిలో నలుగురే జాయిన్‌‌‌‌ అయ్యారు. తిరిగి ఇప్పటివరకు పోస్టుల భర్తీ చేపట్టలేదు. ప్రొఫెసర్లను నియమించాలని, ల్యాబ్‌‌‌‌ సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు విద్యార్థులు రోడ్డెక్కినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.

భూములు కబ్జాల పాలు..

1968లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ కేంద్రంగా ప్రారంభమైన కాకతీయ వర్సిటీ కోసం అప్పట్లో 1,018 ఎకరాల భూమి సేకరించారు. 1980లో ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణానికి 413 సర్వే నంబర్‌‌‌‌లోని కొంత భూమి ఇచ్చారు. ప్రభుత్వం దానికి పరిహారం కూడా చెల్లించింది. తర్వాత క్రమంగా ఎస్సారెస్పీ కెనాల్‌‌‌‌ను ఆనుకుని పలివేల్పుల వైపు ఉన్న 40 ఎకరాల వర్సిటీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. కబ్జాదారుల్లో ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. స్టూడెంట్​ యూనియన్లు ఆందోళన చేసినప్పుడు ఈ వ్యవహారంపై స్పందించడం, తర్వాత పట్టించుకోకుండా వదిలేయడం పరిపాటి అయిపోయిందని స్టూడెంట్లు చెబుతున్నారు.

అంతా కాంట్రాక్టు, పార్ట్‌‌‌‌టైం ఫ్యాకల్టీయే

టీచింగ్‌‌‌‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో కాంట్రాక్టు, పార్ట్‌‌‌‌టైం లెక్చరర్లతోనే క్లాసులు చెప్పిస్తున్నారు. మొత్తం130 మంది రెగ్యులర్‍ లెక్చరర్లు ఉండగా.. 239 మంది పార్ట్ టైం, 191 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను గతేడాది రూ.52 వేలకు పెంచారు. సెల్ఫ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కోర్సులు బోధిస్తున్న 9 మందికి పాత శాలరీ (రూ.22 వేలు) మాత్రమే ఇస్తామనడం వివాదాస్పదంగా మారింది. ఇక పార్ట్​టైం లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. సెమిస్టర్‌‌‌‌కు ఒకసారి, లేదంటే రెండు సెమిస్టర్లకు కలిపి ఒకేసారి రెమ్యునరేషన్‌‌‌‌ ఇస్తున్నారు. దీంతో నెలవారీగా కుటుంబ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించాలని, రెమ్యునరేషన్​ పెంచాలని నిరాహార దీక్షలు, ఆందోళనలు చేశారు. దాంతో ఒక్కో పీరియడ్​కు ఇచ్చే రెమ్యునరేషన్​ను రూ.450 నుంచి రూ.750కు పెంచారు. ఈ రెమ్యునరేషన్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ కోర్సులు బోధించే లెక్చరర్లకు మాత్రం ఇవ్వడం లేదు.

అవసరం బారెడు.. వచ్చేది చారెడు

ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.120 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం రూ.87 కోట్లే ఇస్తోంది. ఫీజుల రూపంలో వస్తున్న నిధుల్లోంచి ఉద్యోగుల వేతనాలు చెల్లిస్తున్నారు. రిటైరవుతున్న ఫ్యాకల్టీ, బోధనేతర ఉద్యోగులకు వెంటనే ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌‌‌‌ను ఐదారు నెలల తర్వాత ఇస్తున్నారు. బ్లాక్‌‌‌‌ గ్రాంట్‌‌‌‌ కూడా మూడు నెలలకోసారి ఇస్తుండటం ఇబ్బందికరంగా మారింది.

సిబ్బంది భర్తీ ఇష్టారాజ్యం

వర్సిటీకి కొత్తగా వచ్చే వీసీ ఆధ్వర్యంలో డైలీ, టైం స్కేల్, లమ్ సమ్​ పేరిట నాన్​ టీచింగ్​ స్టాఫ్​ను ఇష్టారాజ్యంగా రిక్రూట్‌‌‌‌ చేసుకోవడం రివాజుగా మారింది. ఇక్కడ 800 మంది వరకు బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా.. అందులో 200 మందే పర్మనెంట్‌‌‌‌ ఉద్యోగులు. మిగతా వారు తాత్కాలిక ఉద్యోగులే. వారంతా అటు ఉద్యోగం రెగ్యులరైజ్‌‌‌‌ కాక, ఇటు జీతం పెరగక 20 ఏళ్లుగా డ్యూటీ చేస్తున్నారు.

హాస్టళ్లలో సౌకర్యాలు నిల్‌‌‌‌..

కేయూలో 11 హాస్టళ్లు ఉన్నాయి. అయితే కొత్త కోర్సులు, పెరిగిన అడ్మిషన్లకు అనుగుణంగా హాస్టళ్లను నిర్మించకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుత అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో అన్ని హాస్టళ్లలో కలిపి 2,800 మంది విద్యార్థులు ఉండగా.. రూములు రెండున్నర వేల మందికి కూడా సరిపోని పరిస్థితి. పరిమితికి మించి స్టూడెంట్లను ఉంచుతుండటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. బాత్రూమ్‌‌‌‌లు, టాయిలెట్స్‌‌‌‌ సరిగ్గా లేక ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. యూరినల్స్‌‌‌‌ బయట ఉండడంతో రాత్రిపూట సమస్య ఎదురవుతోంది. గదులకు తలుపులు, కిటికీలు సరిగా లేక దోమలు, చలితో ఇబ్బందులు పడుతున్నారు.

పరీక్షలపై అన్నీ వివాదాలే..

కేయూ పరీక్షల విభాగం పనితీరుపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 2016లో ఎస్డీఎల్‌‌‌‌సీఈ డిగ్రీ ప్రవేశార్హత పరీక్షల్లో 100 మార్కులకుగాను ఓ అభ్యర్థికి 103 మార్కులు వేశారు. 2017లో కేయూ రెగ్యులర్‌‌‌‌ డిగ్రీలో ఓ విద్యార్థికి 100 మార్కులకుగాను 105 వచ్చాయి. అదే సంవత్సరం పీహెచ్‌‌‌‌డీ ఎంట్రెన్స్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌లో వచ్చిన తప్పులైతే తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో ఇద్దరు పరీక్షల అధికారులపై వేటు వేశారు. 2018లో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కెమిస్ట్రీ సెకండియర్‌‌‌‌ సెకండ్‌‌‌‌ సెమిస్టర్‌‌‌‌ పరీక్షలు రాసిన విద్యార్థినికి ఓ పేపర్‌‌‌‌లో మొత్తం 40 మార్కులకు 43 మార్కులేశారు. మరో పేపర్‌‌‌‌లో 50 మార్కులకు 52 మార్కులు వేశారు. ఫలితాల వెల్లడిలోనూ చాలాసార్లు జాప్యం జరుగుతోంది. ఫలితంగా విద్యార్థులు తర్వాతి కోర్సులో చేరే అవకాశం కోల్పోవడంతోపాటు కొన్నిసార్లు ఉద్యోగాలకు అనర్హులయ్యే పరిస్థితులు ఎదురయ్యాయి.

పరిశోధనలకు ఇబ్బందే..

రసాయన శాస్త్ర పరిశోధ నలకు ఎక్విప్‍మెంట్‍, కెమికల్స్ లేవు. దీంతో ప్రయోగాలు చేయడానికి ఎన్‍ఐటీ, హెచ్‍సీయూకు వెళ్లాల్సిన పరిస్థితి. నాణ్యమైన కెమికల్స్ దొరకడం లేదని హైదరాబాద్‍ నుంచి తెప్పించుకుంటున్నాం. ఆ భారమంతా మాపైనే పడుతోంది. పరిశోధనలకు సదుపాయాలు కల్పించి కేయూలో పరిశోధనలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి.- పాలబిందెల రాంబాబు, కెమిస్ట్రీ రీసెర్చ్ స్కాలర్‍

రిక్రూట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ చేపట్టాలి

ఒకప్పుడు 390 మంది ఉన్న ఫ్యాకల్టీ ఇప్పుడు 130కే పరిమితమైంది. పోస్టుల భర్తీకి చర్యలేమీ తీసుకోవట్లేదు. ఇలాగే కొనసాగిస్తే విద్యా ప్రమా ణాలు దెబ్బతింటాయి. వసతుల్లేక స్టూడెంట్స్‌‌‌‌ ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా ఉద్యోగ భద్రత లేక క్లాస్‌‌‌‌లు సరిగా చెప్పలేకపోతున్నారు. జీతాలకు సరిపడా నిధులూ బడ్జెట్‍లో ఇవ్వలేదు. – పుల్లా శ్రీనివాస్‍,    కేయూ టెక్నికల్‍ స్టాఫ్‍ అసోసియేషన్‍

Kakatiya University's reputation has been down fall from last 6 years