రాహుల్​గాంధీ హిందువుల ప్రతినిధి కాదా?

రాహుల్​గాంధీ హిందువుల ప్రతినిధి కాదా?
  • రంజిత్రెడ్డి తనకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటు
  • చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి

గండిపేట/శంషాబాద్, వెలుగు: రాహుల్‌‌ గాంధీకి దమ్ము, దైర్యం లేవని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి విమర్శించారు. యూపీలో బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మతి ఇరానీకి భయపడి వాయనాడ్‌‌కు పారిపోయాడని ఆరోపించారు. ముస్లిం, మైనారిటీల ఓట్లు అధికంగా ఉన్నాయన్న కారణంగానే అక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్నారు. రాహుల్‌‌గాంధీ హిందువుల ప్రతినిధి కాదా అని ప్రశ్నించారు.

కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఆదివారం బీజేపీ శ్రేణులతో కలిసి రాజేంద్రనగర్‌‌ నియోజకవర్గంలోని అత్తాపూర్, బుద్వేల్, రాజేంద్రనగర్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, ఆరాంఘర్, మైలార్‌‌దేవ్‌‌పల్లి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేవెళ్ల కాంగ్రెస్‌‌ అభ్యర్థి రంజిత్‌‌రెడ్డి తన వెంట నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

మొదటి నుంచి కాంగ్రెస్‌‌ ముస్లిం, మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తుందన్నారు. బీజేపీ మాత్రమే ముస్లీం, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. 12 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ వస్తుందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్​అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని, లోక్​సభ ఎన్నికల్లో రేవంత్‌‌రెడ్డి పప్పులు ఉడకవని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోకల శ్రీనివాస్​రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే శంషాబాద్ పరిధిలోని మదనపల్లికి చెందిన బీఆర్ఎస్​మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యులు, 150 మంది కార్యకర్తలు ఆదివారం కొండా విశ్వేశ్వర్​రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.