సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆంధ్రోళ్ల ఏజెంట్ : టీఆర్ఎస్ చీఫ్ కవిత

సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆంధ్రోళ్ల ఏజెంట్ : టీఆర్ఎస్ చీఫ్ కవిత
  •     ఎక్కడపడితే అక్కడ ఆంధ్రోళ్ల విగ్రహాలు పెడుతున్నరు: కవిత
  •     మా జోలికి వస్తే మూతి పళ్లు రాల్తాయని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రోళ్ల ఏజెంట్ ఇప్పుడు మనకు సీఎంగా ఉన్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక కుట్ర ప్రకారం తెలంగాణ మీద, అస్థిత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ పంపుతామన్నారు.

సోమవారం టీఆర్ఎస్ ఆఫీసులో నిర్వహించిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బిడ్డలను పోగొట్టుకున్నామని, వారి త్యాగాలు ఇంధనంగా మారి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కానీ వారి కుటుంబాలకు మాత్రం ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రజల మాదిరిగా చేయాలనేలా దేశమంతా పేరు తెచ్చుకున్నామని చెప్పారు. 

మా రాజకీయాల్లో వేలు పెడ్తే ఊరుకోం..

ఆంధ్రోళ్లు షూటింగ్, వ్యాపారాలు చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరుస్తామని కవిత చెప్పారు. కానీ సెక్రటేరియట్‌‌లో మా రాజకీయాల్లో వేలు పెడ్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. “నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు. టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా. మా టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మంచిగ ఉండదు. 

ఒకసారి పెట్టుకుంటేనే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి. మీ పంచాయితీలు, మీ సంస్కృతి మా మీద రుద్దుతామంటే ఊరుకోం. ఇక్కడ సెటిలైన ఆంధ్రావాళ్లంతా మావాళ్లే. వాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. కానీ మా నీళ్లు, మా రాజకీయాల్లో వేలు పెడ్తామంటే ఊరుకోం” అని కవిత హెచ్చరించారు.