- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తం
- రైతు భరోసా స్కీం ఎన్నికల గిఫ్ట్ గా మారింది
- రైతులకు ఐఫోన్లు ఇచ్చాక యూరియా యాప్ తేవాలని డిమాండ్
గద్వాల, వెలుగు: నడిగడ్డను బీఆర్ఎస్ మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా న్యాయం చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం గద్వాలలో ఓ ఫంక్షన్ హాల్ లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన రైతు సంఘర్షణ సభకు ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. నడిగడ్డ సీడ్ పత్తి రైతులకు వారంలోగా బకాయిలు చెల్లించాలని.. లేదంటే రైతులందరితో కలిసి దీక్ష చేపడతామని కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
రైతు భరోసా స్కీమ్ ఎన్నికల గిఫ్టుగా మారిందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 25 లక్షల మందికి మాత్రమే చేశారని, మిగతా 15 లక్షల మందికి మొండి చేయి చూపించారన్నారు. రైతులందరికీ ఐఫోన్లు ఇచ్చిన తర్వాతే యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. మామూలు ఫోన్లు కూడా లేని రైతులు యాప్ లో యూరియాను ఎట్లా బుక్ చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని కంప్లీట్ చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందన్నారు. నడిగడ్డ నుంచే తెలంగాణ జాగృతి జైత్రయాత్ర స్టార్ట్ అయిందని.. వడ్డేపల్లి మున్సిపాలిటీలో అఖండ విజయాన్ని కట్టబెట్టారన్నారు. గద్వాలలో గెలిచిన పార్టీలో ఉండకుండా వేరే పార్టీలోకి పోవడం అలవాటుగా మారిందన్నారు. నడిగడ్డ నియ్యతి గల గడ్డ అని, ఇకపై ఏ కార్యక్రమాన్ని అయినా ఇక్కడి నుంచే నుండే స్టార్ట్ చేస్తానని తెలిపారు.
గద్వాలలో పిచ్చి రాజకీయాలు నడుస్తున్నాయని, గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలని.. లేదంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు నియ్యతి, ధైర్యం లేనట్టున్నాయన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ సంతోష్ కు రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు.
