బ్రోకర్ల చేతిలో ‘కళ్యాణలక్ష్మి‘

బ్రోకర్ల చేతిలో ‘కళ్యాణలక్ష్మి‘

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌ పథకాల కోసం పెట్టిన నిబంధనలు దళారులకు వరంగా మారాయని, ఒక్కో పెండ్లికి సంబంధించి రూ.10 వేల వరకు చేతులు మారుతున్నాయని టాటా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సోషల్​ సైన్సెస్​ (టిస్) ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వం పెట్టిన రూల్స్​ అమ్మాయిల తల్లిదండ్రులకు తలనొప్పిగా మారాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు సర్టిఫికెట్ల కోసం తిరగడం, అధికారులతో సంతకాలు చేయించడం వంటివి చేసుకోలేకపోతున్నారని గుర్తించింది. దీంతో దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఉందని పేర్కొంది.

మూడు జిల్లాల్లో అధ్యయనం

రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌, ఆంధ్రప్రదేశ్‌‌లో అమలవుతున్న చంద్రన్న పెళ్లికానుక (సీపీకే) పథకాలఅమలు తీరుపై ‘టిస్‌‌’ పరిశోధకులు అధ్యయనం చేశారు. ‘కండిషనల్‌‌ క్యాష్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌ స్కీమ్స్‌‌ అండ్‌‌ చైల్డ్‌‌ మ్యారేజెస్‌‌’ పేరిట రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో, ఏపీలోని కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. 2015 నుంచి 2018 మధ్య గద్వాల జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌ పథకాల కింద లబ్ధి పొందినవారిలో బీసీలు 2,561 మంది, ఎస్సీ 929, ఈబీసీలు 111, ఎస్టీలు 41 మంది ఉన్నట్టు గుర్తిం చారు. ఈ పథకం ఉద్దేశం మంచిదే అయినా, లబ్ధి పొందడం కోసం పెట్టిన రూల్స్​ ఇబ్బందిగా మారాయని టిస్‌‌ పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు. ఈ పథకాలకు వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్‌‌ చేసే రెవెన్యూ శాఖకు ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా ఉండడంతో సిబ్బంది, అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని తెలిపారు.

మధ్యవర్తులతోనే పనంతా..

దరఖాస్తు విధానం ఆన్‌‌లైన్‌‌ విధానంలో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది ఎదురవుతోంది. దరఖాస్తు కోసం ఆధార్‌‌ కార్డు, మ్యారేజ్‌‌ సర్టిఫికెట్‌‌, క్యాస్ట్‌‌ సర్టిఫికెట్‌‌, ఆధార్‌‌ కార్డు, బొనఫైడ్‌‌ సర్టిఫికెట్‌‌, వధువు ఏజ్‌‌ సర్టిఫికెట్‌‌, ఫస్ట్ మ్యారేజ్‌‌ సర్టిఫికెట్‌‌, మ్యారేజీ వెరిఫికేషన్‌‌ సర్టిఫికెట్‌‌, రెసిడెన్స్‌‌ సర్టిఫికెట్లను అప్‌‌ లోడ్‌‌ చేయాల్సి ఉంటుంది. వాటిని సిద్ధం చేసుకోవడం పెద్ద ప్రయాసగా మారినట్లు టిస్‌‌ పరిశోధకులు గుర్తించారు. దీంతో దరఖాస్తుదారులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నట్టు తేల్చారు. ఇలాంటి మధ్యవర్తుల్లో టెన్త్‌‌ లేదా ఇంటర్‌‌ వరకు చదువుకుని, కొంత కంప్యూటర్‌‌ పరిజ్ఞానం కలిగినవారే ఎక్కువగా ఉన్నారు. వారికి ఫొటోలు, ఆధార్‌‌ కార్డు ఇస్తే మ్యారేజీ సర్టిఫికెట్లు, బోనఫైడ్‌‌ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేయడంతోపాటు, అవి త్వరగా వచ్చేలా చేస్తున్నారు. ఇందుకు రూ.10 వేల వరకు తీసుకుంటున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొన్నట్టు టిస్‌‌ తన నివేదికలో వెల్లడించింది. గతంలో దరఖాస్తుకు అప్రూవల్‌‌ ఇస్తూ ఎమ్మెల్యే సంతకం పెట్టాలన్న నిబంధన రాజకీయ జోక్యానికి దారి తీసిందని, దరఖాస్తుదారులు ఇతర పార్టీలకు చెందినవారైతే అప్రూవల్‌‌ కోసం ఎనిమిది నుంచి పది నెలల వరకు ఆలస్యం జరిగినట్టుగా తెలిసిందని పేర్కొంది. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తే.. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయొచ్చని ఈ నివేదికలో సిఫార్సు చేసింది.