అమెరికా అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్న కమలా హారిస్

అమెరికా అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్న కమలా హారిస్

భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి తప్పుకున్నారు. ఈ నిర్ణయంతో ఆమె అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని ఎదురు చూసిన ఇండియన్లకు నిరాశకలిగించింది. డెమక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీపడిన కమలాహారిస్ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న భయంతో బరిలో నుంచి తప్పుకున్నారు. అమెరికాలో సెనేటర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్ ఒకానొక దశలో డెమక్రటిక్ అభ్యర్థుల్లో కీలకనేతగా మారారు. తదుపరి ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తో తలపడేది ఆమేనన్న భావన కలిగించారు. కానీ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా బరి నుంచి తప్పుకున్నారు. నిన్నటితో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన కమల మొదట ఈ విషయాన్ని తన సీనియర్ సిబ్బందికి తెలిపారు. తర్వాత తన మద్దతుదారులకు ట్వీట్ చేశారు. దీంతో పాటు ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటానంటూ ట్విట్టర్ ట్వీట్ చేశారు.

కమలా హారిస్ బరిలో నుంచి తప్పుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. నిన్ను మేము కోల్పోతున్నామంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. దీనికి అంతే దీటుగా స్పందించారు కమల. ట్రంప్ బాధపడాల్సిన అవసరం లేదు…త్వరలో మీపై జరిగే అభిశంసన విచారణలో కలుస్తానంటూ ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు.