అతనితో పాటే కన్నడ ఫిల్మ్ మేకింగ్‌లో ఒక కొత్త వేవ్ వచ్చింది. అతని ఐడియాలజీ, అతను ఎంచుకునే కథలకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యేలా చేసింది. ఒక జోన్ నుంచి మరొక జోన్‌కి చాలా ఈజీగా మారిపోతూ... జీరో నుంచి మొదలుపెట్టి కాంటెంపరరీ స్టార్స్‌లో ఒక ప్రత్యేకమైన హీరోగా, రైటర్‌గా ఎదిగాడు. ‘‘ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు.. తీసిన వాటిలో ఎన్ని చరిత్రలో నిలిచిపోతాయి అన్నదానికే ఇంపార్టెన్స్ ఇస్తానం’’టూ సినిమాల్లోనూ సింప్లీనెస్కి కేరాఫ్‌గా మారిన శాండల్‌వుడ్ సింపుల్ స్టార్ రక్షిత్ శెట్టి జర్నీ ఇది.
‘‘రీసెంట్గా నేను నటించిన ‘777 చార్లీ’ రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ ఐదేండ్లు, నేను మూడున్నరేండ్లు పని చేశాం. ఒక కుక్కతో 167 రోజులు షూటింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆడియెన్స్ ఇప్పుడు ఆ ఎమోషన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే టీమ్‌కి సంతోషాన్ని ఇస్తోంది. కానీ, ఆ సీన్స్ షూటింగ్ చేయడం చాలా కష్టం. ఇతర సినిమాలతో పోలిస్తే ఇది పది రెట్లు ఎక్కువ ఛాలెంజ్ అని చెప్పొచ్చు.
డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్
‘నీ లైఫ్ లో కూడా ఈ సినిమాలో చూపించినట్టు అలా ఒక కుక్కతో అనుబంధం ఉందా?’ అని చాలామంది అడుగుతున్నారు. నిజానికి అలాంటిదేం లేదు. నా చిన్నప్పుడు మా ఇంట్లో రెండు కుక్కలు ఉండేవి. పన్నెండో తరగతి తర్వాత చదువుకోవడానికి నేను హాస్టల్‌కి వెళ్లిపోయా. ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యాక మొత్తం బెంగళూరుకే పరిమితమయ్యా. కానీ, ఇరవైయేండ్ల తర్వాత ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో మాత్రం ఒక కుక్కతో పర్సనల్‌గా అనుబంధం ఏర్పరచుకున్నా. ప్రస్తుతం ‘సప్త సాగరదాచే ఎల్లో’, ‘రిచర్డ్ ఆంథోని’ ప్రాజెక్ట్స్ చేస్తున్నా.క్యారెక్టర్ ఏదైనా సరే దానికి తగ్గట్టు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తీసుకురావడం ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నటన నాకు స్పిరిచ్యువల్ జర్నీ లాంటిది. ప్రతి కథకు ఒక జీవం ఉంటుంది. మంచి సినిమా కావాలని రాస్తా. అలాగే డైరెక్షన్ వేరేవాళ్లకి ఇయ్యడం ఇష్టం ఉండదు. అందుకని నేనే డైరెక్ట్ చేస్తా.
చిన్నప్పుటినుంచే..
కర్ణాటక- తుళునాడులో ఉన్న ఉడిపిలో బంటు ఫ్యామిలీలో1983లో పుట్టా. నా మాతృ భాష తుళు. నాన్న శ్రీధర్ శెట్టి, సివిల్ కాంట్రాక్టర్. అమ్మ రంజని గృహిణి. నాకు అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. ఉడిపిలోనే ముకుందా కృప స్కూల్లో చదువుకున్నా. స్కూల్‌కు వెళ్లే టైంలో తుళునాడు జానపద డాన్స్ చేసేవాడిని. మా టీచర్స్ నాటకాలు రాసేవాళ్లు. అందులో చిన్న పిల్లల రోల్ ఉందంటే నాకు ఇచ్చేవారు. అలా స్కూల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్‌లో బాగా పాల్గొనేవాడిని. చదువులో మరీ అంత బ్రైట్ స్టూడెంట్నేం కాదు. చిన్నప్పటి నుంచే యాక్టర్ కావాలి అనుకునేవాడిని. నా ఆలోచనకు మా ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేసేవారు. మా అన్నయ్య మేగజైన్స్ తెచ్చి నాకు ఇచ్చేవాడు. కథలు కూడా చెప్పేవాడు. చిన్నప్పట్నించే నాటకాలు రాసి, మా ఫ్రెండ్స్‌తో యాక్ట్ చేయించేవాడిని. ఎనిమిదో తరగతిలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరా. కానీ, మా ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్ గ్రూప్ మాత్రం కంటిన్యూ చేశాం. కర్కలలోని నిట్టేలో ఉన్న ఎన్.ఎమ్.ఎ.ఎమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఈసీఈలో ఇంజనీరింగ్ చేశా. నాకు వచ్చిన తుళు జానపద డాన్స్ వల్లే 2014లో వచ్చిన ‘ఉళిదవరు కండంతే’ మూవీలో డాన్సర్‌గా మేజర్ రోల్ చేసే అవకాశం వచ్చింది.
నా కెరీర్‌కి పునాది అదే
ఇంజినీరింగ్ తర్వాత రెండేండ్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశా. నా పనంతా మూడు నుంచి నాలుగ్గంటల్లో పూర్తి చేసి, ఆఫీసులో కూడా మొత్తం సినిమాలే చూసేవాడిని. ఫిల్మ్ మేకింగ్ గురించి చదివేవాడిని. అలా నెమ్మదిగా షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఫిల్మ్ మేకర్స్, థియేటర్ ఆర్టిస్టులను కలిసి మాట్లాడటం ప్యాషన్‌గా మారిపోయింది. ఆ పరిచయాలతో ఒక సినిమాలో చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ, ఆ సినిమా విడుదల కాలేదు. 2009లో ‘లెట్స్ కిల్ గాంధీ’ అనే షార్ట్ ఫిల్మ్ తీశా. దాంతో నా పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం తెలిసింది. 2010లో అరవింద్ కౌశిక్ తన ‘నమా ఏరియాలో ఒందినా’ సినిమాలో చిన్న రోల్ ఇవ్వడంతో కన్నడ ప్రేక్షకులకు పరిచయమయ్యా. అక్కడే నా కెరీర్ కి పునాది పడింది. తర్వాత ఆయనే చేసిన ‘తుగ్లక్ ’ మూవీలో కూడా నటించా. ఇది గడిచి పన్నెండేండ్లు అవుతోందంటే నమ్మబుద్ధి కాదు. నా ఫస్ట్ మూవీ విడుదల చేయడానికి ఇప్పటికీ మేం గాంధీనగర్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది.
హీరోగా అవకాశం
‘సింపుల్ ఆగి ఒంద్ లవ్‌స్టోరీ’ సినిమా 2013లో వచ్చింది. ఆ సినిమాతో హీరోగా పరిచయమయ్యా. సినిమా సూపర్ హిట్ అయింది. 2014లో ‘ఉళిదవరు కండంతే’ కథ రాశా. నన్ను నేనే డైరెక్ట్ చేసుకున్నా. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అది నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. అంతకుముందు నేనెవరికీ తెలియదు. ‘ఉళిదవరు కండంతే’ మూవీలో కనిపించాక, ‘సింపుల్ ఆగి ఒందు లవ్‌స్టోరీ’ మూవీలో చేసిన అబ్బాయే ఇందులో చేశాడని గుర్తుపట్టడం మొదలుపెట్టారు.
కిరిక్ పార్టీ
నేను 2016 లో చేసిన ‘గోది బన్న సాధారణ మైకట్టు’ మూవీ సూపర్ హిట్ అయింది. అదే సంవత్సరంలో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ బ్లాక్ బస్టర్‌గా నిలిచి, నాకు స్టార్డమ్ తీసుకొచ్చింది. ‘కిరిక్ పార్టీ’ నా లైఫ్ లో చాలా స్పెషల్ మూవీ. మా హోమ్ బ్యానర్లో చేసిన ఫస్ట్ మూవీ. అలాగే, రష్మిక మందన్నా కూడా ఈ సినిమాతోనే నా లైఫ్‌లోకి వచ్చింది. కిరిక్ పార్టీ మూవీ కోసం చాలా కష్టపడి పని చేశా. ఇక్కడ మీకో విషయం చెప్పాలి... ఇంజినీరింగ్ చదివేరోజుల్లో మొదట నేను డేస్కాలర్. మూడు నెలల తర్వాత హాస్టల్‌కి మారా. నా లైఫ్ లో బెస్ట్ డేస్ కాలేజీ డేస్. వాటి ఇన్స్పిరేషన్తోనే ఈ కథ రాసుకున్నా. ఇప్పటికీ ఆ సినిమా గురించి, అందులోని సీన్స్ గురించి అందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది.‘కిరిక్ పార్టీ’ చేశాక, సీన్ మారిపోయింది. ఆ సినిమాకు కర్నాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. యూట్యూబ్ ‘కిరిక్ పార్టీ’ పాటలకు కొన్ని మిలియన్ల వ్యూస్ రావడంతో కర్నాటకలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో ప్రేక్షకులకు కూడా నేను, నా సినిమాలు పరిచయం అయ్యాయి. 2019లో నటించిన ‘ అవనే శ్రీమన్నారాయణ’ కూడా మరో బ్లాక్ బస్టర్. ఆ కథ కూడా నేనే రాశా.
ప్యాండెమిక్ డేస్
ప్యాండెమిక్ టైమ్‌లో నాలుగు నెలలు ఇంట్లోనే ఉన్నా. అప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్ రోజుల్లో ఉన్నట్టే అనిపించింది. ఆ టైమ్‌లో బుక్స్ చదివా. సినిమాలు చూశా. కొన్ని కథలు కూడా రాసుకున్నా. అలా నాకు ఇష్టమైన పనులన్నీ చేశా. మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టినట్టు అనిపించింది. అప్పటికీ, ఇప్పటికీ ఒకే ఒక తేడా. అదేంటంటే... పన్నెండేండ్ల కింద మొదలుపెట్టినప్పుడు నాకు ఎలాంటి అనుభవం లేదు. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్‌లో ఉన్నా. కానీ ఇప్పుడు నాకు కొంత అనుభవం వచ్చింది. అది నాకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది.
ఆ రెండూ సమానమే
ఒక్కసారి వెనక్కి తిరిగి నా జర్నీని చూసుకుంటే, నా బెస్ట్ ఇచ్చాననే అనుకుంటున్నా. నా యాక్టింగ్ ఇంకా బెటర్ చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా. సినిమా కోసం పడే తపన, ప్యాషన్ ఇంకా నాలో సజీవంగా ఉన్నాయి. నా సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌కు కూడా విలువ ఇస్తా. ఆ ప్రాసెస్ నాకు అనేక అవకాశాలు ఇచ్చింది. వాటిలో ఏ మూవీ లేకపోయినా నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు.
వీళ్లే నా మోటివేషన్
నేను చిన్నప్పుడు చూసిన సినిమాల హీరోలే నన్ను యాక్టింగ్ వైపు మళ్లేందుకు ప్రేరేపించారు. కమల్ హాసన్ సర్ చేసే సీన్స్, దివంగత రాజ్ కుమార్ చేసిన పౌరాణిక సినిమాలు నన్ను చాలా మోటివేట్ చేశాయి. శంకర్ నాగ్ సర్ నా ఫేవరేట్ యాక్టర్, డైరెక్టర్. ఆయన 24/7 కష్టపడి కమర్షియల్ సినిమాలు తీశారు. 40 సినిమాల్లో నటించి, 11 సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు ఆల్ టైమ్ క్లాసిక్ అని మనం అనుకునే ‘మాల్గుడి డేస్’ 30 ఎపిసోడ్స్ మలిచిన తీరు నాకు చాలా ఇష్టం. ఇవన్నీ ఆయన కేవలం పదకొండేండ్ల కాలంలోనే చేశారంటే, అస్సలు ఊహించలేం. ఆయన హార్డ్ వర్క్, టైమ్ వేస్ట్ చేయకుండా పనిచేయడం... నన్ను ఇన్స్పైర్ చేశాయి.
ఎన్ని చేశామని కాదు
పని చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తా. నా ప్రాజెక్టుల్లో కొన్నింటికి ఎక్కువ టైం పట్టింది. కొన్నింటికి అంత టైం పట్టలేదు. నేను ఎక్కువ సినిమాలు చేయాలన్న రేసులో లేను. ఉండను కూడా. యాభై సినిమాలు చేసినా సరే, మనం చేసిన వాటిలో బెస్ట్ ఐదు సినిమాల్ని మాత్రమే ఫ్యూచర్ జనరేషన్ గుర్తుపెట్టుకుంటుంది అనేది నా నమ్మకం. నా వర్క్ గుర్తుంచుకోవడమే నాకు కావాలి. రాబోయే పదేండ్లలో ఇన్ని సినిమాలు తీయాలి లేదా ఫలానా సబ్జెక్ట్స్ తీయాలనే ప్లాన్స్ ఏవీ నాకు లేవు. అలాంటి టార్గెట్స్ కూడా పెట్టుకోలేదు.’’
:::గుణ
టైమ్ వేస్ట్ చెయ్యను
టైమ్ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టపడను. ఒక్క రోజు వేస్ట్ చేస్తే, ఆ పని రెండో రోజుకు వాయిదా పడుతుంది. చాలామంది నన్ను, నా పనిని ప్రేమిస్తున్నారు. అలాంటప్పుడు నేను నా టైమ్ వేస్ట్ చేయలేను. ఇది నాకు ఎప్పుడూ ఒక రిమైండర్ అన్నమాట. నేనేం పని చేసినా సరే నెర్వస్ అవుతుంటా. కానీ, ఎంత బెస్ట్ ఇవ్వగలనో అది ఇచ్చేస్తా. ఆ మూమెంట్లో ఉండి హార్డ్ వర్క్ చేస్తా.
ఆమెను జడ్జ్ చేయొద్దు
కిరిక్ పార్టీ టైంలో రష్మిక, నేను ప్రేమలో పడ్డాం. ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ, కొన్ని భిన్నాభిప్రాయాల వల్ల మేం విడిపోయాం. ఈ బ్రేకప్‌కి చాలామంది ఆమెను ట్రోల్ చేశారు. బ్లేమ్ చేశారు. ఆమెను బ్లేమ్ చేయడం ఆపమని నా అభిమానులందరినీ రిక్వెస్ట్ చేశా. సోషల్ మీడియాలో ఉన్నవాళ్లందరికంటే రష్మిక గురించి నాకే ఎక్కువ తెలుసు. ఆమెను జడ్జ్ చేయడం ఆపండి. ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వండి. ‘‘నువ్వు పరిచయం చేసిన రష్మిక ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తోంద’’ని చాలామంది అడుగుతుంటారు. ఆమె ఎదుగుదల నాకు సంతోషాన్నే ఇస్తుంది. ఆమె తన కెరీర్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా.
