కండ్లకోయ ఆర్వోబీకి గ్రీన్ సిగ్నల్..కేంద్రం ఆధీనంలోకి ఎకరా పట్టా భూమి

కండ్లకోయ ఆర్వోబీకి గ్రీన్ సిగ్నల్..కేంద్రం ఆధీనంలోకి ఎకరా పట్టా భూమి

న్యూఢిల్లీ, వెలుగు: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామంలో రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మేడ్చల్–గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ 599/1-4 వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్ నం.246ఏ స్థానంలో ఆర్వోబీ నిర్మించనున్నారు. రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 20ఈ(1) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే రోడ్డు సేఫ్టీ ప్రాజెక్ట్స్ కన్స్‌ట్రక్షన్ చీఫ్ ఇంజినీర్ మనోజ్‌కుమార్ వెల్లడించారు. 

గెజిట్ నోటిఫికేషన్‌తో కండ్లకోయ గ్రామంలోని సర్వే నంబర్లు 196, 199, 209, 210, 211 పరిధిలోని సుమారు ఎకరం పట్టా భూమి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ఈ భూసేకరణలో మామిడి, వేప చెట్లు, ప్రహరీలు, గోదాములు, బోర్‌వెల్స్ తదితర నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం జనవరి 10న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు స్వీకరించగా, భూ యజమానులు, ఆసక్తిగల వ్యక్తుల నుంచి వచ్చిన అభ్యర్థనలను విచారించిన అనంతరం రైల్వే చట్టంలోని సెక్షన్ 20డీ ప్రకారం తిరస్కరించినట్లు తెలిపారు. అనంతరం సమర్థ ప్రాధికార సంస్థ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు.