
- 55 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేయాలి
- ఆఫీసర్లతో ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి హరీశ్
- వంద పని దినాల్లో పూర్తి చేయాలని ఆదేశం
- ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు : కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి జనవరి 18 నుంచి కంటి వెలుగు చేపడుతున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. ఈసారి 1,500 బృందాలతో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎంపీటీసీ, సర్పంచ్, ఇలా ప్రజా ప్రతినిధులంతా కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో 55 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేయాలని ఆఫీసర్లను ఆయన ఆదేశించారు. వాటిలో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయన్నారు. గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంను ఎనిమిది నెలలపాటు నిర్వహించామని, ఈసారి వంద పని దినాల్లో కండ్లద్దాలు పంపిణీ చేయాలన్నారు.
‘1500 బృందాలు వారానికి ఐదు రోజులు పనిచేయాలి. శని, ఆదివారాలు సెలవు. ఆ బృందాలకు1500 వాహనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తం. రెగ్యులర్ సర్వీసుకు ఇబ్బంది కలగకుండా చూస్తం. డీఎంహెచ్ వోలు బాగా పని చేయాలి. ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో పాటు జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి. కంటి వెలుగు రెండో విడతపై జనవరి 5న జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తం. జనవరి 1 వరకు ఆటో రీఫ్రాక్టో మెషీన్లు వస్తాయి. కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగానే రీడింగ్ గ్లాసెస్ లను అందుబాటులోకి తెస్తం. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేస్తం. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తం” అని హరీశ్ వివరించారు. ఎల్వీ ప్రసాద్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి సహకారంతో రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని, అద్దాల బాక్స్ మీద reబార్ కోడ్ ఉంటుందని, స్కాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలు ఉంటాయన్నారు. 1500 ఆప్టో మెట్రిషన్స్, 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్లను త్వరగా నియమించాలని ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు.