V6 News

‘కానుకుర్తి’ పనులు షురూ...‘ఎన్ కేఎల్ఐఎస్’లో కీలకంగా కానుకుర్తి రిజర్వాయర్

‘కానుకుర్తి’ పనులు షురూ...‘ఎన్ కేఎల్ఐఎస్’లో కీలకంగా కానుకుర్తి రిజర్వాయర్
  •     పది రోజుల కిందట భూమి పూజను అడ్డుకున్న భూ బాధితులు
  •     బాధితులతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు సఫలం
  •     15 రోజుల్లో పెండింగ్​లో ఉన్న రూ.80 కోట్ల పరిహారం చెల్లింపునకు హామీ
  •     ఇటీవలే రిజర్వాయర్​ పనులకు శ్రీకారం

మహబూబ్​నగర్​/నారాయణపేట, వెలుగు : నారాయణపేట–కొడంగల్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం (ఎన్​కేఎల్​ఐఎస్​) పనుల్లో కీలక అడుగు ముందుకు పడింది. లిఫ్ట్​ కింద అత్యంత ప్రధానమైన కానుకుర్తి రిజర్వాయర్​ నిర్మాణ పనులకు రాష్ర్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పది రోజుల కిందటే ఈ రిజర్వాయర్​ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, పరిహారం అంశం తేల్చాలని భూ బాధితులు డిమాండ్ చేయడంతో కార్యక్రమం వాయిదా పడింది. భూమి పూజకు వచ్చిన ఆఫీసర్లను రైతులు అడ్డుకొని వెనక్కి పంపారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ర్ట ప్రభుత్వం నాలుగు రోజుల కిందట రైతులతో చర్చలు జరిపింది. 

నారాయణపేట నియోజకవర్గ ఇన్​చార్జి కుంభం శివకుమార్​ రెడ్డి నేతృత్వంలో ఆఫీసర్లు రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. 15 రోజుల్లో పెండింగ్​లో ఉన్న పరిహారం మొత్తాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పనులు ప్రారంభించేలా సహకారం అందించాలని కోరారు. దీనికి రైతులు అంగీకారం తెలుపడంతో మూడు రోజుల కిందట పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఇరిగేషన్​ ఆఫీసర్లు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

కీలకం కానున్న రిజర్వాయర్​

ఎన్​కేఎల్​ఐఎస్​కు కానుకుర్తి రిజర్వాయర్​ అత్యంత కీలకంగా మారింది. ఈ లిఫ్ట్​ కింద మొత్తం పది రిజర్వాయర్లు నిర్మిస్తుండగా, కేవలం కానుకుర్తి రిజర్వాయర్​లో మాత్రమే నీటిని నిల్వ చేసేలా డిజైన్​ చేశారు. ముందుగా ఒక టీఎంసీ స్టోరేజీతో డెవలప్​ చేయాలనుకున్న ఈ రిజర్వాయర్​ను రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీల నీటి నిల్వ చేయడానికి ప్లాన్​ చేశారు. మొదట్లో లిఫ్ట్​ పరిధిలోని పది రిజర్వాయర్లను ఒక టీఎంసీ నుంచి ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీతో నిర్మించాలని నిర్ణయించగా, ముంపు సమస్య వస్తుందనే సందేహాలు వచ్చాయి.  దీనికితోడు రెండో దశలో ఉన్న రిజర్వాయర్లను ఫుల్​ కెపాసిటీతో నింపేందుకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇరిగేషన్​ ఆఫీసర్లు రాష్ర్ట ప్రభుత్వానికి సూచనలు చేశారు. 

దీంతో ప్రాజెక్టు డిజైన్​లో మార్పులు చేశారు. లిఫ్ట్​ పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కెపాసిటీ పెంచకుండా మొదటి దశలోని చివరి రిజర్వాయర్​గా ఉన్న  కానుకుర్తి కెపాసిటీని మాత్రమే పెంచేందుకు నిర్ణయించారు. రెండో దశలోని రిజర్వాయర్లకంటే ఈ రిజర్వాయర్​ ఎత్తులో నిర్మించి దీని కెపాసిటీని పెంచడం వల్ల గ్రావిటీ  ద్వారా చివరి రిజర్వాయర్​ వరకు ఈజీగా లక్ష్మీపూర్​, దౌల్తాబాద్, ఈర్లపల్లి, హుస్నాబాద్​, కొడంగల్​, దౌల్తాబాద్​ రిజర్వాయర్లకు నీటిని తరలించొచ్చు. అయితే నీటి నిల్వ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న ఎత్తుకంటూ పది మీటర్ల లోతుకు రిజర్వాయర్​లో తవ్వకాలు చేపట్టనున్నారు. 

అలాగే లీకేజీ సమస్య రాకుండా రింగ్​ బండ్​ను నిర్మించనున్నారు. అలాగే స్పిల్​ వే గేట్లు, ఔట్​ లెట్​ స్లూయిస్​, రిజర్వాయర్​ డిస్ర్టిబ్యూషన్​ రెగ్యులేటర్​ (ఆర్​వీఆర్​)ను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణాల ద్వారా రిజర్వాయర్​లో నీటిని నింపే సమయంలో అదనపు నీరు స్పిల్​ వే ద్వారా బయటకు పంపనున్నారు. రిజర్వాయర్​ పూర్తి స్థాయి మట్టానికి చేరుకున్నాక నిల్వ చేసిన నీటిని అవసరాలకు అనుగుణంగా ఔట్​ లెట్​ స్లూయిస్​ ద్వారా దిగువన ఉన్న రిజర్వాయర్లకు నీటిని తరలించేలా కానుకుర్తి రిజర్వాయర్​ను డిజైన్​ చేశారు. 

992.39 ఎకరాల భూ సేకరణ

ఎన్​కేఎల్​ఐఎస్​ పనులను స్టేజ్​-1, స్టేజ్​-2గా విభజించారు. ఇందులో స్టేజ్​-1 పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు. కానుకుర్తి రిజర్వాయర్​ పనులను ప్యాకేజీ-2, ప్యాకేజీ-3లో చేపట్టనున్నారు. ఇందులో ప్యాకేజీ-2లో రిజర్వాయర్​, ప్యాకేజీ-3లో కాలువలు, ఇతర పనులు ఉన్నాయి. ఈ రిజర్వాయర్​ నిర్మాణం కోసం మొత్తంలో 992.39 ఎకరాలకు భూ సేకరణ చేయల్సి ఉండగా,  ఇందులో కానుక్కుర్తి గ్రామ పరిధలోని 837.37 ఎకరాలు, గడిమున్కన్​పల్లిలో 45.01, మల్​రెడ్డిపల్లిలో110.01 ఎకరాలను 681 మంది రైతుల నుంచి సేకరించారు. ఇందులో 462.16 ఎకరాలకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున రైతులకు పరిహారం డబ్బును అందించారు. 

కానీ కానుకుర్తి గ్రామ పరిధిలోని 400 ఎకరాలకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున దాదాపు రూ.80 కోట్ల పరిహారం డబ్బు చెల్లింపు పెండింగ్​లో ఉంది. నాలుగు రోజుల కిందట ప్రభుత్వం తరఫున కాంగ్రెస్​ పార్టీకి చెందిన నారాయణపేట నియోజకవర్గ ఇన్​చార్జి కుంభం శివకుమార్​ రెడ్డితో రైతులతో మాట్లడి పనులను ప్రారంభింపజేసేందుకు వారిని ఒప్పించారు. ప్రభుత్వం కూడా రెండు వారాల్లో పెండింగ్​ పరిహారాన్ని ఇచ్చేందుకు ఒకే చెప్పడంతో రైతులు పనులు ప్రారంభానికి గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో కాకుకుర్తి రిజర్వాయర్​ నిర్మాణ పనులకు ఆఫీసర్లు కొబ్బరికాయ కొట్టారు.