- డివిజన్లలో ఫాగింగ్ చేయడంలో ఆఫీసర్లు అట్టర్ ఫ్లాప్
- 66 డివిజన్లు, 42 విలీన గ్రామాలకు ఒక్కో సిబ్బందితో పనులు
- గ్రేటర్ వరంగల్లో మలేరియా సెక్షన్ బయలాజిస్ట్ పోస్ట్ఖాళీ
- దోమకాటుతో ఈసారి డెంగ్యూ, చికున్ గున్యా బాధితులు పెరిగే ప్రమాదం
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో దోమలు రాజ్యమేలుతున్నాయి. జెట్ కాయిల్స్, ఆలౌట్స్ ఎన్ని వాడినా ఫలితం కనిపిస్తలేదు. నగరంలోని డివిజన్లు, విలీన గ్రామాల్లో దోమల సమస్య పెద్ద ఛాలెంజ్‌గా మారింది. గతంలో ఎప్పుడూ ఇంతలా దోమలు ఉండేవి కావని స్వయంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఒప్పుకుంటున్నారు. ప్రారంభంలోనే నియంత్రణ చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ మలేరియా విభాగాన్ని పర్యవేక్షించాల్సిన బయాలజిస్ట్ పోస్టు కూడా ఖాళీగా ఉంది.
11 లక్షల మందికి.. 150 మంది సిబ్బంది..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధి 407.70 స్వ్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 11 లక్షల జనాభా ఉన్నారు. 42 విలీన గ్రామాలతో కలిపి వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో 66 డివిజన్లు ఉన్నాయి. కాగా, దోమల కట్టడి కోసం జీడబ్ల్యూఎంసీ పరిధిలో అర్బన్ మలేరియా సెక్షన్ ప్రత్యేకంగా పనిచేస్తోంది.
60 మంది ఔట్ సోర్సింగ్, 90 మంది డైలీ వైజ్, మరో 20 మంది రెగ్యూలర్ సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. ఇందులో మహిళలు, ఆరోగ్యం సరిగాలేనివారు, సెలవుల్లో ఉండేవారిని మినహాయిస్తే నిత్యం 100 నుంచి 120 మంది విధుల్లో యాక్టివ్‍గా ఉంటున్నారు. ఈ లెక్కన ప్రతి లక్షమందికి 10 మంది చొప్పున దోమల కట్టడి కోసం పనిచేస్తున్నారు. కనీసం 300 మంది సిబ్బంది ఉంటేనే పనులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
నాసిరకం దోమల మందుతో పెరిగిన సమస్య
జీడబ్ల్యూఎంసీ పరిధిలో కూడా అక్టోబర్, నవంబర్ నెలల్లో లార్వాను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మురుగు కాలువలు, నాలాలు, మోరీలు ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు పంపుల ద్వారా ఎక్కడికక్కడ స్ప్రే చేయడం ద్వారా దోమలు గుడ్డు దశలోనే నశించేటట్లు చూడాలి. వరంగల్ నగరంలో దోమల నియంత్రణ కోసం వినియోగిస్తున్న ‘టెమెపాస్’, ‘థింక్’ వంటి ప్రభావం తక్కువగా ఉన్న నాసిరకం (సింగిల్ స్ట్రెంథ్) రసాయనాల వాడకం సమస్యను మరింత పెంచిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం దోమల సైజు పెరిగి ఇబ్బంది పెడుతున్నాయి.
అంతేకాకుండా జీడబ్ల్యూఎంసీ పరిధి పబ్లిక్ హెల్త్ విభాగంలో ప్రజారోగ్యం కోసం దోమల కట్టడికి కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.88 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇందులో కెమికల్స్, పౌడర్ల కొనుగోలు కోసం కేవలం రూ.38 లక్షలు మాత్రమే వెచ్చించారు. గ్రేటర్ పరిధిలో దోమల కట్టడికి దాదాపు 250 నుంచి 300 లీటర్ల 'మస్కిటో లార్విసైడల్ ఆయిల్' అవసరం ఉండగా, కేవలం 40 లీటర్లలోపు ఆయిల్‍తో దోమల కట్టడి సేవలు అందించారు.
కాలనీల్లో కనిపించని ఫాగింగ్..
జీడబ్ల్యూఎంసీ అర్బన్ మలేరియా విభాగంలో డివిజన్లవారీగా దోమల నివారణకు ఫాగింగ్ చేయడానికి కాశీబుగ్గ సర్కిల్ కోసం 4, కాజీపేట సర్కిల్ పరిధిలో 4 చొప్పున ఫాగింగ్ ఆటోలు ఉన్నాయి. ముందస్తు చర్యల కోసం 77 స్ర్పే చేసే పంపులు ఉన్నాయని చెబుతున్నా నిజానికి 60 లోపే ఉన్నాయి. తక్కువ పంపులు ఉండడంతో సిబ్బంది ఒకట్రెండు గల్లీల్లో పిచికారి చేసి మమ అనిపిస్తున్నారు. దీంతో జనాలకు దోమల బెడద ఎక్కువై డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ ఫీవర్ల బారినపడే ప్రమాదం ఎక్కువైంది.
డబుల్ స్ట్రెంథ్ కెమికల్స్ తెప్పించినం..
గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇంతస్థాయిలో దోమల వ్యాప్తి ఇదే మొదటిసారి. లార్వా దశలోనే అరికట్టాల్సి ఉండగా, వరదల కారణంగా వాటి నిరోధక శక్తి పెరిగి కెమికల్ సరిగా పనిచేయలేదు. సమస్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు కాలనీలు, డ్రైనేజీలు, కుంటల్లో పిచికారి చేయడానికి ప్రభుత్వ ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన డబుల్ స్ట్రెంథ్ ఉండే మస్కిటో లార్విసైడల్ ఆయిల్ తెప్పించాం. డివిజన్లవారీగా పంపులతో స్ర్పే, ఫాగింగ్ చేపించి ద్వారా దోమల బెడద లేకుండా చర్యలు తీసుకుంటాం. - రాజారెడ్డి సీఎంహెచ్వో, జీడబ్ల్యూఎంసీ

