V6 News

వెలుగు ఓపెన్ పేజీ:మన తెలంగాణ, మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం గెలిచింది

వెలుగు ఓపెన్ పేజీ:మన తెలంగాణ, మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం గెలిచింది

దక్షిణాదిన డీఎంకే  గట్టిగా  నిలబడకపోతే,  సగం తెలంగాణ ఎంపీలు  పార్లమెంటులో డిమాండ్  చేయకపోతే  మొత్తం మన దేశానికే హాని జరిగేది.  తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు,  మొత్తం ఆంధ్రప్రదేశ్​లో అందరూ బీజేపీకి పట్టాభిషేకం చేసినా  మూడింట రెండు వంతుల  మెజారిటీ  అనే రాజ్యాంగ  నియమంతో భారతదేశ  ప్రజాస్వామ్యం బతికింది.  17 ఏప్రిల్  2026న పార్లమెంటులో ఏం జరిగిందో అది భారత రాజకీయాలను మార్చేసింది. ఇంతకూ డీలిమిటేషన్ అంటే ఏమిటి?  భారతదేశంలో దీని అర్థం ఏమిటంటే  దేశ జనాభా ప్రకారం ఒక  నియోజకవర్గంలో ఎంతమంది  ప్రజలు ఉండాలి,  ఆ  నియోజకవర్గం  రూపురేఖలు (మ్యాప్) ఎలా ఉండాలి,  ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు రావాలి అన్నది  తాజా జనగణన డేటా  ప్రకారం నిర్ణయించవలసి ఉంటుంది. (అప్​డేట్​ చేయడం) దీనినే  డీలిమిటేషన్  అంటారు.  కానీ,  ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు రావాలి అన్నది చాలాకాలంగా మారలేదు.  ఎందుకంటే మొదట దీనిని  ఇందిరాగాంధీ ఫిక్స్ (ఫ్రీజ్) చేశారు. అంటే  రాజ్యాంగంలో రాసుకున్న రీతిగా పదిసంవత్సరాలకు ఒకసారి జనగణన చేస్తే, ఎవరి జీవనం ఏ విధంగా ఉంది, వారి రాబోయే జీవితాన్ని నిర్మించే పద్ధతి ఏమిటో నిర్ణయించుకోవచ్చు. 


ఇందిరాగాంధీ విధానాన్ని  అటల్ బిహారీ  వాజ్​పేయి  కూడా యథాతథంగా  కొనసాగించారు.  ఎందుకంటే  జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోకూడదని.  అయితే,   సీట్ల సంఖ్య పెంచకపోయినా, 2001 జనగణన ప్రకారం  సీట్ల  సరిహద్దులను  2008లో  మార్చారు.  ఆ  కొత్త  సరిహద్దుల  ప్రకారం  మొదటి  ఎన్నిక  2009లో  జరిగింది.  

జెరిమాండరింగ్ 

2011 జనగణన  ప్రకారం ఇంత త్వరగా  బీజేపీ ఎందుకు డీలిమిటేషన్  బిల్లు  తీసుకొచ్చింది?  అంటే  ఇప్పటికే  2026న కొత్త  జనగణన  ప్రారంభమైంది కదా?   ఆవిధంగా  కొత్త జనగణన  పూర్తయితే,  ఆ తర్వాత  ఫలితాలు  వస్తాయి,  తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడవచ్చు.  ఇవి అన్నీ చేయడానికి చాలా సంవత్సరాలు పడతాయి.  ఎంత త్వరగా చేసినా 2029 ఎన్నికలు ఈ కొత్త డీలిమిటేషన్  ప్రకారం జరిగే అవకాశం లేదు. అందుకే 2011 జనగణన ఆధారంగా  ప్రకారం డీలిమిటేషన్  బిల్లును  ముందుకు తీసుకొచ్చారని తెలుస్తున్నది.   మొదట అన్ని రాష్ట్రాలకు వారి జనాభా ప్రకారం సీట్లు నిర్ణయిస్తారని చెప్పారు.  కానీ, చర్చ సమయంలో  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సవరణలో రాసిన దానికి విరుద్ధంగా అన్ని సీట్లను నేరుగా 50% పెంచుతామని స్పష్టంగా ఒక పెద్ద హామీ ఇచ్చారు.  

ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల ఎంపీల శాతం 23.76% ఉంది.  ఇప్పుడు 50% పెంపు తర్వాత అది 24% అవుతుంది,  అంటే శక్తి తగ్గడం లేదు, పెరుగుతున్నది.  శాతం పరంగా కూడా దక్షిణ భారతానికి ఏ నష్టమూ ఉండదు.  ఈ విషయాన్ని బిల్లులో రాసి చేర్చడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు.  50% శాతం రాతపూర్వకంగా కావాలంటే  ఒక గంట సభను  నిలిపివేయండి.   నేను అధికారిక సవరణ తీసుకొస్తాను అని హోం మంత్రి వివరించారు. అయినా కూడా ప్రతిపక్షం ఎందుకు అంగీకరించలేదు?  ఎందుకంటే ఇంకా ప్రభుత్వానికి విపరీతమైన అధికారం వారి చేతిలోనే ఉన్నందున  సీట్ల సరిహద్దులను వారు తమకు అనుకూలంగా మళ్లీ హద్దులు  కొత్తగా  గీయగలుగుతారు. దీనివల్ల  బీజేపీకి  అనుకూలంగా  రాజకీయ  ప్రయోజనాలు  చేకూర్చుతాయి.  దీనిని సాంకేతికంగా  జెరిమాండరింగ్ అంటారు.  ఇదే ప్రధాన కారణంగా ప్రభుత్వం,  ఎన్నో  రాష్ట్రాలలో ఎన్నికలు  జరుగుతున్న దశలో  ఈ  కీలకమైన  బిల్లును  స్వప్రయోజనాల  కోసం  తీసుకొచ్చింది. 

పాచిక పారలేదు

ఈ  బిల్లు  వీగిపోతుందనే  భయం ముందుగానే వచ్చింది.  అందుకే  ఇందులో మహిళా రిజర్వేషన్ అంశాన్ని  కలిపారు.  తద్వారా బిల్లు  వీగిపోతే,  మహిళల  రిజర్వేషన్   దెబ్బతీశారని  ప్రతిపక్షాన్ని నిందించవచ్చు.  ఆ పాచిక పారలేదు.  ప్రభుత్వ బలహీనతను  బయటపెట్టింది.  డీలిమిటేషన్  బిల్లు ఉన్నట్టుండి  అదీ  ఎన్నికల  మధ్య  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  2023 నాడే  మహిళల రిజర్వేషన్ చట్టం ఉన్నా అది లేనే లేనట్టు దాని చాటున డీలిమిటేషన్ బిల్లు అనే రాజ్యాంగ సవరణ 131 బిల్లును పార్లమెంట్ ముందు పెట్టారు. 

నిజానికి  డీలిమిటేషన్  బిల్లు  ఓడిపోయిందనే నిజాన్ని దాచి,  ఇదివరకే  ఆమోదించిన మహిళా  రిజర్వేషన్ చట్టం దిక్కులేకుండా పోయిందని అనడం చాలా అన్యాయం.   రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు  298 ఓట్లు  సాధించినప్పటికీ,  ఆమోదానికి అవసరమైన మెజారిటీని చేరుకోలేకపోయింది. అందుకే రాజ్యాంగం  గెలిచింది.  మెజారిటీపరంగా చూస్తే  ప్రభుత్వ బిల్లు గెలుస్తుంది.  ఆ లెక్కన ఎన్డీఏ  గెలిచింది.  కానీ,  భారతదేశ రాజ్యాంగపు కీలకమైన మార్పు కావాలంటే  టూ బై  థర్డ్​  మెజారిటీ  కావాల్సిందే. 

రాజకీయ వ్యూహం

డీలిమిటేషన్ అని పిలిచే రాజ్యాంగ 131 సవరణ బిల్లు పడిపోగానే దాని వెంటనే సంబంధిత  డిలిమిటేషన్ బిల్లు, యూనియన్ టెరిటరీల సవరణ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, ఈ మూడు చట్టాలు వేర్వేరు కాదని, ఒకే రాజకీయ వ్యూహంలో  భాగమని స్పష్టం చేసింది.   ప్రభుత్వం ఈ మూడు బిల్లుల సమాహారాన్ని రెండు ముఖ్య లక్ష్యాలుగా వివరించింది.  2029 సాధారణ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్ అమలు,  అదేవిధంగా  ‘ఒక మనిషి – ఒక ఓటు – ఒక విలువ’  అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని పునరుద్ధరించడం.

చివరకి ఓ గంట సమయం ఇవ్వండి.  మీకు మహిళా రిజర్వేషన్లను ఇప్పటినుంచి అమలు చేస్తామనే  సవరణ ఇస్తాను అన్నారు. 1971 జనగణన ఆధారంగా ఉన్న ఫ్రీజ్ కారణంగా నియోజకవర్గాల పరిమాణాల్లో తీవ్ర అసమానతలు ఏర్పడ్డాయని,  ‘హైదరాబాద్​లో  మల్కాజిగిరి వంటి  నియోజకవర్గంలో దాదాపు 48 లక్షల  ఓటర్లను  ఒక ఎంపీ ఎలా  ప్రాతినిధ్యం వహించగలడు?’ అని  ప్రశ్నించారు.  నిజమే.  డీలిమిటేషన్ వంటి వివాదాస్పద అంశంతో లంకె పెట్టడం ఎందుకు?  తమిళనాడు డీఎంకే  ఎంపీ  కనిమొళి ‘భారత  మహిళలను ఎన్నికల కోసం ఒక మానవ కవచంగా  ఉపయోగిస్తున్నారు’ అని  నిలదీశారు.  కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దీనిని  ‘పొలిటికల్ డీమోనిటైజేషన్’గా అభివర్ణిస్తూ,  ‘మీరు నారీశక్తికి న్యాయం అనే వాగ్దానాన్ని కంచెతో చుట్టేశారు’ అని విమర్శించారు.  

హామీలు పనికి రావు 

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమానంగా అన్ని రాష్ట్రాలకు 50% సీట్ల పెంపు ఉంటుందని  చెప్పిన హామీ  ఒక  నీళ్లమూట.  1971 నాటి  జనగణన  లెక్కలు ఏవిధంగా  మారుస్తారు.  అట్లా అయితే  2021 నాటి లెక్కలను ఎందుకు  పరిగణించలేదు. 2023 నాటికే మహిళా రిజర్వేషన్ చట్టం ఉన్నా , అది బిల్లు అంటూ దశాబ్దం తరువాత వస్తుందని తాజా వాగ్దానం చెప్పడం అన్యాయం.  ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 25 సీట్లు  38కి  పెరుగుతాయని చెబుతున్నారు, కానీ జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే అవి 30కి  తగ్గవచ్చు.  

తమిళనాడులో 39 నుంచి 59కి పెరుగుతాయని చెబుతున్నారు.  కానీ, పునర్విభజనలో అది 47కి  పడిపోవచ్చు.  కానీ,  ఉత్తరప్రదేశ్‌‌‌‌లో మాత్రం 80 నుండి 120కి, లేదా ఇంకా ఎక్కువకు పెరుగుతుంది అని మాజీ కేంద్రమంత్రి  పి చిదంబరం  వివరించారు.  ఈ నేపథ్యంలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ఈ బిల్లును  ‘మహిళల బిల్లు కాదు, ఎన్నికల వ్యవస్థను మార్చే రాజకీయ ప్రయత్నం’గా  పేర్కొన్నారు.  ఈ బిల్లు  ఓటమిని ఆయన  ‘రాజ్యాంగంపై  దాడిని అడ్డుకున్న విజయంగా’ అభివర్ణించారు.

డెమోగ్రాఫిక్ మెజారిటీ  నియంతృత్వం

ఎంపీ ప్రియాంక గాంధీ  కూడా ‘ఇది మహిళల కోసం కాదు, అధికారంలో నిలబడటానికి చేసిన ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తూ...  మహిళల హక్కులను వెంటనే అమలు చేయాలంటే 2023లో  ఆమోదించిన  చట్టాన్ని తీసుకురండి.  మేం పూర్తి మద్దతు ఇస్తాం అని స్పష్టం చేశారు.   జనాభా  నియంత్రణలో విజయవంతమైన  దక్షిణ రాష్ట్రాలు,  ఈ పద్ధతిలో  తమ  ప్రాతినిధ్యాన్ని  కోల్పోతాయనే  భయం  వ్యక్తమైంది.  శశిథరూర్  హెచ్చరించినట్టు.. డెమోగ్రాఫిక్ మెజారిటీ  నియంతృత్వం  అనే ప్రమాదం తలెత్తవచ్చు.  రాజకీయ వ్యాఖ్యాత హరీష్ ఖరే  చెప్పినట్టు ‘ప్రభుత్వం పై కథనం నిర్దేశించే స్థితిలో లేరు.  వారిపై ఉన్న విశ్వాసం మందగించింది’ అనే అభిప్రాయం రాజకీయంగా గంభీరమైనది.

రాజ్యాంగ  సవరణలకు టూ బై థర్డ్​ మెజారిటీ అవసరం అనేది కేవలం సంఖ్యల పరిమితి కాదు.  అది ఒక రక్షణ వ్యవస్థ.  అది విస్తృత సమ్మతి లేకుండా నిర్మాణాత్మక మార్పులు జరగకుండా అడ్డుకుంటుంది.  ఈ సందర్భంలో ఆ రక్షణ పనిచేసింది.  సమాఖ్య  సమతుల్యతను గౌరవిస్తూ,  స్పష్టమైన రాజ్యాంగ  హామీలతో ముందుకు రావాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టమైంది.  ఇవ్వాళ దేశాన్ని రక్షించింది  ప్రతిపక్షం.  ఓటర్లంతా  ఆలోచించవలసిన  విషయం ఇది. 

- మాడభూషి శ్రీధర్,మాజీ కేంద్ర సమాచార కమిషనర్​
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.