- బీఆర్‌టీఎస్ అమలుపై సర్కార్ కసరత్తు
- నగర బస్సులకు ప్రత్యేక కారిడార్ల ఏర్పాటుకు అధ్యయనం
- ట్రాఫిక్ జామ్‌లకు చెక్..
- మెట్రో తరహా సేవలు అందేలా చర్యలు
- అహ్మదాబాద్, పుణె తరహాలో కార్యాచరణ
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడంతో పాటు ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బస్సుల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్) అమలుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ విధానం అమల్లోకి వస్తే సిటీ బస్సుల వేగం పెరగడం, జర్నీ టైం సేఫ్ కావడం, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ప్రజలు వ్యక్తిగత వాహనాలకంటే ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో బస్సు ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(బీఆర్‌టీఎస్) అమలుపై దృష్టి సారించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత సులభతరంగా మార్చేందుకు విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
నగరంలోని ఏయే రోడ్లపై బీఆర్‌టీఎస్ అమలు చేయవచ్చనే అంశంపై ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా, తక్కువ వ్యయంతో మెట్రో తరహా వేగవంతమైన రవాణా అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ప్రజా రవాణా విధానమే బీఆర్‌టీఎస్. ఇందులో బస్సుల కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేస్తారు.
ఆ మార్గాల్లో ఇతర వాహనాలను అనుమతించబోరు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయడంతో బస్సుల్లో సమయం వృథా కాదు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్, బస్సు ఫ్లోర్ ఒకే ఎత్తులో ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ప్రయాణించవచ్చు. కూడళ్ల వద్ద బస్సులకు ప్రాధాన్యత ఇచ్చే సిగ్నల్ వ్యవస్థను కూడా వినియోగిస్తారు.
170కి పైగా నగరాల్లో అమలు..
ప్రపంచంలోని 170కిపైగా నగరాల్లో బీఆర్‌టీఎస్ అమలవుతోంది. 1974లో బ్రెజిల్‌లోని కురిటిబా నగరంలో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రారంభించారు. కొలంబియాలోని బొగోటా నగరంలో ‘ట్రాన్స్‌మిలీనియో’ వ్యవస్థ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆసియాలోనే తొలి బీఆర్‌టీఎస్ నెట్‌వర్క్ ఏర్పాటైంది. చైనాలోని పలు ప్రధాన నగరాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంది.
అహ్మదాబాద్, పూణేలో సక్సెస్..
మన దేశంలో పూణేలో 2006లో ‘రెయిన్‌బో’ పేరుతో బీఆర్‌టీఎస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ‘జన్‌మార్గ్’ పేరుతో ఈ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోంది. మెట్రోతో పోలిస్తే నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, ప్రయాణ సమయం తగ్గడం, కాలుష్యం తగ్గడంలో ఇది ఉపయోగపడుతోందని నిపుణులు చెబుతున్నారు.
అధికారుల అధ్యయనం..
ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా బీఆర్‌టీఎస్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశ, విదేశాల్లో ఈ విధానం అమలవుతున్న ప్రాంతాలను పరిశీలించి, హైదరాబాద్‌లో అమలుకు అనువైన మార్గాలు, ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలపై అధ్యయనం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజినీర్లు నగరంలోని ప్రధాన రహదారులపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బీఆర్‌టీఎస్ సిస్టమ్‌తో జర్నీ ఫాస్ట్
ట్రాఫిక్ దృష్ట్యా సిటీలో ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. బీఆర్‌టీఎస్ వ్యవస్థను అమలు చేస్తే నగర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మెట్రో రైల్ లాగే నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలవుతుంది. తద్వారా బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది.
- తమ్మి దిలీప్ కుమార్, టీజీఆర్ఎస్ ప్రిన్సిపాల్, కొడకండ్ల
