- సూర్యాపేటలో మిల్లర్లు,
- అధికారుల బాగోతం బట్టబయలు
- రాష్ట్రంలో వారం రోజులుగా
- విజిలెన్స్ అధికారుల తనిఖీలు
- ఇప్పటి వరకూ 225 కోట్ల విలువైన 70 వేల టన్నుల వడ్లు మాయమైనట్టు గుర్తింపు
- అన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తే వేల కోట్ల అక్రమాలు బయట పడే చాన్స్
- ఐదుగురు మిల్లర్లపై పీడీ యాక్ట్.. మరికొందరిపై క్రిమినల్ కేసులు
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలకలం
ఇదో మూతపడ్డ రైస్ మిల్లు.. గేటు తీసి లోపలికి వెళ్లే నాథుడే లేడు. కానీ రికార్డుల్లో మాత్రం ఆ మిల్లు యమ స్పీడుగా నడుస్తోంది. వేల టన్నుల ధాన్యం మిల్లింగ్ అవుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు చేసిన ఘనకార్యం ఇది. 2024 నుంచి అసలు మిల్లే నడవకపోయినా.. 2024–25 రబీలో 45 వేల క్వింటాళ్లు, 2025–26లో 15 వేల క్వింటాళ్లు కేటాయించారు. రెండు సీజన్లలో కలిపి సుమారు రూ.14.5 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించారు.
సూర్యాపేట/కరీంనగర్, వెలుగు: కస్టమ్మిల్లింగ్రైస్(సీఎంఆర్) కోసం ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లర్లు, అధికారులు కలిసి పక్కదారి పట్టించారు. మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం కేటాయించడమే కాదు, ఏకంగా మూతపడ్డ మిల్లులకూ భారీగా ధాన్యం కేటాయించి వేల కోట్ల సర్కారు సొమ్మును కొల్లగొట్టారు. 2022–23 సీజన్‌నుంచి సీఎంఆర్కోసం కేటాయిస్తున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్న మిల్లర్ల ఆట కట్టించేందుకు రాష్ట్ర సర్కారు తాజాగా విజిలెన్స్బృందాలను రంగంలోకి దించింది. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డీఫాల్టర్లుగా తేలిన పలువురు మిల్లర్లపై దాడులు నిర్వహిస్తుండడంతో అక్రమాలు బయటకు వస్తున్నాయి.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.225 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్టు విజిలెన్స్ బృందాలు గుర్తించాయి. సుమారు 70 వేల టన్నుల వడ్లను బియ్యంగా మార్చేసి మిల్లర్లు అమ్మేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటివరకూ ఒక్కో జిల్లాలో ఐదారు మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తేనే ధాన్యం నిల్వల్లో ఈ స్థాయిలో తేడాలు గుర్తిస్తే.. మిగతా మిల్లుల్లో సోదాలు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బియ్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఐదుగురు మిల్లర్లపై పీడీ యాక్ట్.. మరికొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. మిల్లర్, ప్రముఖ బీసీ నేత వట్టే జానయ్య యాదవ్ దంపతులపై పీడీయాక్ట్ పెట్టిన పోలీసులు.. ఆయన కొడుకు గణేశ్‌ను అరెస్ట్ చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్రం కలకలం రేపింది.
సూర్యాపేట జిల్లాలో రూ.150 కోట్ల వడ్లు మాయం..
బీఆర్ఎస్ప్రభుత్వ హయాం నుంచి సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లను మాయం చేయడంలో సూర్యాపేట మిల్లర్లు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా ఈ జిల్లాలో 7 మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు నిర్వహించగా.. రూ.150 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు బయటపడింది. ఈ నెల 20న నల్గొండ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సూర్యాపేట సివిల్ సప్లయ్ ఆఫీసర్లు కలిసి సూర్యాపేట మండలం బాలెంల గ్రామ శివారులోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్ పై ఏకకాలంలో దాడులు చేశారు.
ఎఫ్‌సీఐకి పంపాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. వజ్ర రైస్ కార్పొరేషన్‌లో 11,073 టన్నుల ధాన్యం, వజ్ర వికాస్ రైస్ మార్ట్ లో 18,114 టన్నుల ధాన్యం కలిపి మొత్తం 29,187.888 టన్నుల ధాన్యం మాయమైనట్టు నిర్ధారించారు. సూర్యాపేటలోని రవికృష్ణ రైస్ ఇండస్ట్రీలో ఈ నెల 24న విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి 12 వేల టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్టు తేల్చారు.
సోమవారం జరిగిన దాడుల్లో సుమారు 47.62 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్టు తేల్చారు. వీటిలో జేపీ రైస్ మిల్లులో రూ.11.67 కోట్లు విలువ చేసే 11,600 క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టించగా.. సూర్యాపేట మండలం కసారాబాద్లోని శ్రీవెంకటేశ్వర మిల్లులో రూ.27.23 కోట్ల విలువ చేసే 1.14 లక్షల క్వింటాళ్ల ధాన్యం, సూర్యాపేటకు చెందిన నవరత్న రైస్ మిల్లులో రూ.8.72 కోట్ల విలువ చేసే 3,653 టన్నుల సీఎమ్మార్ ధాన్యం మాయమైనట్టు గుర్తించారు.
నిజామాబాద్ జిల్లాలో రూ.65.50 కోట్ల వడ్లు గాయబ్
నిజామాబాద్ జిల్లా కాలూర్ సమీపంలోని సిద్ధిరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఈ నెల 22న విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. 31,597 టన్నులకుగాను 11,228 టన్నుల ధాన్యం మాత్రమే ఉంది. మిగతా 20 వేల టన్నుల ధాన్యం అందుబాటులో లేదని తేలింది. దీని విలువ రూ.58 కోట్లు ఉంటుందని అంచనా. కామారెడ్డి జిల్లాలోని రైస్ మిల్లుల్లో రూ.7.5 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది.
కరీంనగర్ జిల్లాలో ఐదు మిల్లులు.. రూ.20 కోట్ల వడ్లు
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఐదు రైస్ మిల్లులపై సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. హుజూరాబాద్ బోర్నపల్లిలోని సాయిట్రేడర్స్ యజమాని 2021 -– 22 ఖరీఫ్, 2022 –-23 రబీలో సీఎంఆర్ కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని బియ్యంగా మరాడించి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 20న సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. 3,061 టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు.
25 శాతం ఫైన్‌తో కలిపితే వీటి విలువ రూ.7.84 కోట్లు ఉంటుందని అంచనావేశారు. దీంతో సాయి ట్రేడర్స్ ఓనర్ జ్యోతిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అదే రోజు జమ్మికుంట సప్తగిరి రైస్ మిల్లులో తనిఖీలు చేసి సుమారు రూ.7 కోట్ల విలువైన 2,700 టన్నులకుపైగా ధాన్యం మాయమైనట్టు గుర్తించారు.
వివిధ జిల్లాల్లో..
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని శ్రీ సత్య సాయి ఆగ్రో రైస్ మిల్లులో సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా రూ.7.17 కోట్ల విలువైన 3,029 టన్నుల ధాన్యం పక్కదారిపట్టినట్టు గుర్తించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా.. రూ.2.71 కోట్ల విలువైన 969.132 టన్నుల ధాన్యం, శ్రీతిరుమల ఇండస్ట్రీస్ రైస్ మిల్‌లో రూ.26.35 లక్షల విలువైన 94.118 టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని అరుణాచల శివ రైస్ మిల్లులో తనిఖీలు చేయగా.. రూ.1.23 కోట్ల విలువైన 4,400 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉందని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిల్లు ఓనర్ ఓరుగంటి కిరణ్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారంలోని యాదాద్రి రైస్ మిల్లులో జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించగా.. రూ. 16 కోట్ల విలువైన వడ్లు కనిపించలేదు. దీంతో వారి ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు మిల్లు ఓనర్ నూనె వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు
తరలించారు.
ఐదుగురిపై పీడీ యాక్ట్
బియ్యం ఇవ్వకుండా కేటాయించిన వడ్లన్నింటినీ అమ్మేసిన మిల్లర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తోంది. ఈ క్రమంలో పీడీ యాక్ట్‌లు నమోదు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. రూ.73 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించిన వజ్ర రైస్ మిల్లర్, తెలంగాణ రాజ్యాధికా పార్టీ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్, ఆయన భార్య వట్టే రేణుక, కొడుకు గణేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. జానయ్య కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారు మహాలక్ష్మి ఇండస్ట్రీస్, సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్ కు కేటాయించిన వడ్లను మాయం చేసిన మిల్లర్ బండారి మారుతిపై రామగుండం కమిషనరేట్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.103 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పెగడపల్లికి చెందిన రాఘవేంద్ర రైస్ మిల్లు ఓనర్ రూ.20.20 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయి ఉండడంతో పోలీసులు ఈ నెల 22న పీడీ యాక్ట్ నమోదు చేశారు.
