- రాష్ట్రవ్యాప్తంగా 2,604 రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాల పంపిణీ
- ఒక్కోచోట 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లు
- విత్తనాల ఎంపిక, నాణ్యతపై శాస్త్రవేత్తలతో అవగాహన
- ఈ నెల 29 వరకు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తున్న రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సీడ్ మేళాలు నిర్వహిస్తున్నది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బుధవారం (ఈ నెల 29) వరకు రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 2,604 రైతు వేదికల్లో ఈ విత్తన మేళా నిర్వహిస్తారు.
ఆయా చోట్లా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు వాటి సాగుపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల ద్వారా అవసరమైన సలహాలు సూచనలు అందించనున్నారు. రైతుల సౌకర్యం కోసం ప్రతి రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి కందులు, పెసలు, మినుములు, మక్క, జొన్న, కూరగాయలతో పాటు ఇతర పంటలకు సంబధించిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వ్యవసాయాధికారులు చెప్తున్నారు.
శాస్త్రవేత్తలతో ప్రత్యేక అవగాహన..
విత్తన మేళాలో భాగంగా అన్ని చోట్లా రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణులు రైతులకు పంటలు, విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలపై సలహాలు అందించనున్నారు. అటు ఏఈవోలు, ఏవోలు, ఏడీఏలు, డీఏవోలు, హార్టికల్చర్ ఆఫీసర్లు సైతం స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి ఏ పంటలు సాగు చేయాలి, ఏ రకమైన విత్తనాలు ఎంచుకోవాలి, నీటి యాజమాన్యం ఎలా ఉండాలనే అంశాలపై రైతులకు వివరిస్తున్నారు.
ఎల్‌నినోకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం
వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అగ్రికల్చర్ సెక్రటరీ కె.సురేంద్ర మోహన్ సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం వెల్జర్ల గ్రామ రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. పాడి రైతులు పశుగ్రాసం కొరత రాకుండా మేత జొన్న సాగు చేసుకోవాలని, నగర శివారు ప్రాంతాల రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో తక్కువ కాలంలో మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, శాస్త్రీయ సాగు పద్ధతులు అవలంబిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని చెప్పారు.
విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తమ ప్రాంత భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలను శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకొని నష్టాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి.
- డాక్టర్ గోపి, అగ్రికల్చర్ డైరెక్టర్
