హైదరాబాద్ లో రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో వెండర్ జోన్లు...ప్రభుత్వ స్థలాల రక్షణ, ఆదాయానికి సర్కార్ ప్లాన్

హైదరాబాద్ లో  రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో  వెండర్ జోన్లు...ప్రభుత్వ స్థలాల రక్షణ, ఆదాయానికి సర్కార్ ప్లాన్
  • చిన్న చిన్నషాపులు కట్టి అద్దెకు ఇచ్చే యోచన  
  • ట్రాఫిక్​ సమస్య పరిష్కారం.. ఆదాయం వచ్చే చాన్స్​

హైదరాబాద్​సిటీ,వెలుగు : నగరంలో చౌరస్తాలు, రోడ్ల సమీపంలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వ స్థలాలను రక్షించడంతో పాటు వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు హెచ్​ఎండీఏలోని హుమ్టా కొత్త ప్లాన్​ రూపొందించింది. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధిలోని చౌరస్తాలు, రోడ్ల సమీపంలో ప్రభుత్వానికి చిన్న చిన్న స్థలాలు చాలా ఉన్నాయి. 

వీటిని కొందరు ప్రైవేట్​వ్యక్తులు పాగా వేసి కబ్జా చేస్తుండడంతో ఆయా స్థలాల్లో చిన్నచిన్న షాపులు కట్టి అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. ‘వెండర్​ జోన్’ పేరుతో వీటిని అభివృద్ధి చేసి కబ్జాల నుంచి రక్షించడంతో పాటు ఇన్​కం సంపాదించాలని
అనుకుంటోంది.  

వెండర్​ జోన్లు ఇలా... 

సిటీలోని చాలా ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఫుట్​పాత్​లపై, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. వీరి వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన స్థలాలను ఫ్రీగా వాడుకుంటుండడంతో ఈ ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్నషాపులను కట్టి వెండర్స్​ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిటీలో ఎక్కడెక్కడ ప్రభుత్వానికి చెందిన చిన్న చిన్న స్థలాలు ఉన్నాయన్న దానిపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. 

ముందుగా అమీర్​పేట జంక్షన్, సత్యం థియేటర్​ఎదురుగా ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను కొందరు చిరు వ్యాపారులు వాడుకుంటున్నారని గుర్తించారు. ఇక్కడి స్థలాల్లో వాహనాలు పార్కింగ్​చేయడం, చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేయడం, తోపుడు బండ్ల వ్యాపారాలు చేస్తుండడంతో ట్రాఫిక్​ సమస్య ఉత్పన్నమవుతుందని గుర్తించారు. దీంతో ఇక్కడ వెండర్​ జోన్ ​ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. షాపులు కట్టి చిరు వ్యాపారులకే అద్దెకు ఇవ్వడం వల్ల ఆదాయమూ వస్తుందని చెప్తున్నారు.