తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్.. కుటుంబ ధ్రువీకరణ కష్టాలకు చెక్పెట్టేందుకు కొత్త సేవలు

తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్.. కుటుంబ ధ్రువీకరణ కష్టాలకు చెక్పెట్టేందుకు కొత్త సేవలు
  • దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే సర్టిఫికేట్  
  • మీసేవా ద్వారా అందుబాటులోకి కొత్త సేవలు
  • రేషన్ కార్డ్ ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాల నమోదు
  • ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు సులభంగా పొందేందుకు మాత్రమే
  • ఆస్తులు, చట్టబద్ధ హక్కులకు సంబంధం లేదని పేర్కొంటూ రాష్ట్ర సర్కార్​ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు, వివిధ ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ ధ్రువీకరణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ పరిధిలో ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ పేరుతో ఒక సమగ్ర  ‘స్టేట్ ​లెవల్ ఎలక్ట్రానిక్ రిజిస్టర్‌’ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి లోకేశ్​ కుమార్ సోమవారం ఉత్తర్వులిచ్చారు.  

పౌరులు తమ కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి అధికారిక రికార్డును సులభంగా పొందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. వివిధ శాఖల పనుల కోసం పౌరులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని మీసేవ ప్లాట్‌ఫామ్ ద్వారా కుటుంబ వివరాల ధ్రువీకరణను పొందేందుకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. 

రేషన్ కార్డు డేటాతో అనుసంధానం

ప్రభుత్వం రూపొందించే ఫ్యామిలీ రిజిస్టర్‌లో ప్రతి ఫ్యామిలీకి సంబంధించి పక్కా వివరాలను నమోదు చేయనున్నారు. రేషన్ కార్డు నంబర్‌నే ఈ రిజిస్టర్‌లో ‘ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా పరిగణిస్తారు. సివిల్ సప్లైస్ కమిషనర్ నిర్వహించే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డేటాబేస్ నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివరాలను సేకరించి ఈ రిజిస్టర్‌లో పొందుపరుస్తారు. 

ఇందులో కుటుంబ యజమాని పేరు, కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుని పేరు, యజమానితో ఉన్న సంబంధం, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ సంఖ్య, దరఖాస్తుదారు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా (ఇంటి నంబర్, వీధి, గ్రామం, వార్డు, మండలం, జిల్లా) వివరాలు స్పష్టంగా పొందుపరుస్తారు. పౌర సరఫరా శాఖ డేటాబేస్, మీసేవ ప్లాట్‌ఫామ్ మధ్య సాంకేతిక అనుసంధానం ఏర్పాటు చేయాలని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్‌ను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

దరఖాస్తు విధానం ఇలా..

కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కావాలనుకునే పౌరులు నేరుగా సమీపంలోని మీసేవా కేంద్రం ద్వారా గానీ, లేదంటే మీసేవా ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో వయస్సు నిండిన  ఏ ఒక్క సభ్యుడైనా ఈ పత్రం కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీసేవా వ్యవస్థ ఆటోమేటిక్​గా రేషన్ కార్డులోని చిరునామా ఆధారంగా సంబంధిత మండల తహసీల్దార్ లాగిన్‌కు ఆ దరఖాస్తును పంపుతుంది. 

తహసీల్దార్ పౌర సరఫరా శాఖ రికార్డులతో సరిచూసి, వివరాలు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకున్న అనంతరం డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్‌ను ఆమోదిస్తారు. ఈ దరఖాస్తులను స్వీకరించిన కేవలం రెండు పనిదినాల నిబంధన గడువులోనే పరిష్కరించి, దరఖాస్తుదారునికి మీసేవ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు.

ఆస్తులు, చట్టబద్ధ హక్కులకు సంబంధం లేదు

ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కేవలం సివిల్ సప్లైస్ డేటాబేస్​లో ఉన్న కుటుంబ సభ్యుల వివరాల రికార్డు మాత్రమేనని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ఆస్తులపై ఎలాంటి హక్కులు, టైటిల్, లేదా చట్టబద్ధమైన వారసత్వ హక్కులు  సంక్రమించవని, అలాగే ఇది ఆస్తి వివాదాల పరిష్కారానికి ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు సులభంగా పొందేందుకు మాత్రమే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని రెవెన్యూ అధికారులకు ఈ మార్గదర్శకాలను తెలిపి, ఈ సేవల సక్రమ నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాల్లో స్పష్టంచేసింది.