న్యూయార్క్ లో దారుణం జరిగింది. మేడ్చల్ కి చెందిన కుంచా అన్షుల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్న అన్షుల్ ను గన్ తో కాల్చి చంపేశారు దుండగులు. శుక్రవారం ( జూన్ 5 ) రాత్రి 12 గంటల సమయంలో పిజ్జా డెలివరీ చేస్తుండగా గన్ తో ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. అన్షుల్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వాసి అని సమాచారం.
నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియాలోని ఒక ఖాళీ ఇంటికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన అన్షుల్ ను దుండగులు కాల్చి చంపినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటన ఎడ్జ్‌లీ స్ట్రీట్‌లోని 2300 బ్లాక్‌లో తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో జరిగిందని తెలిపారు. తలకి బుల్లెట్ గాయంతో అన్షుల్ కుప్పకూలినట్లు తెలిపారు పోలీసులు.
అన్షుల్ ను టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు నిర్దారించారని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
