- సభకు పక్కాగా ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
- ఉదండాపూర్ నిర్వాసితుల కష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిన పరిహారంపై ప్రత్యేక వీడియో ప్రదర్శన
- హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు : రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పర్యటన ముగించుకుని శుక్రవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సభకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో అందరి సమన్వయంతో కార్యక్రమం సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రేవంత్ రెడ్డి వేదికపైకి రాగానే కార్యకర్తల ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ ప్రాజెక్టు భూనిర్వాసితులు పడ్డ కష్టాలను, పరిహారం కోసం పోరాడితే ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు ఇచ్చిన హామీ మేరకు వంద శాతం నిధులు విడుదల చేయడంతో నిర్వాసితులు వ్యక్తం చేసిన ఆనందాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు.
అందులో ఒక రైతు సంతోషంతో పల్టీలు కొట్టడం చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మురిసిపోయారు. కాగా, సభ ప్రారంభానికి ముందు అకస్మాత్తుగా వీచిన తీవ్ర గాలులు, స్వల్ప వర్షం కారణంగా ఉదండాపూర్‌తో పాటు సభ స్థలిలో ఏర్పాట్లకు కొంత ఇబ్బంది ఎదురైంది. హెలిప్యాడ్ వద్ద టెంట్లు కూలిపోవడం, పలు ఫ్లెక్సీలు నేలమట్టం కావడంతో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత దృష్ట్యా సభకు తరలివచ్చిన జనానికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
కొల్లాపూర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రెండో రోజైన శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆయా సమస్యలపై పలువురు వినతిపత్రం సమర్పించారు.
