ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసినా, మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా స్మార్ట్‌ఫోన్ల మధ్య మెసేజ్‌లు పంపుకునే కొత్త టెక్నాలజీ ఇప్పుడు చర్చకు వచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కొంతమంది ఆఫ్‌లైన్ మెసేజింగ్ యాప్స్ ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ లేకుండా పనిచేసే బ్లూటూత్ ఆధారిత కమ్యూనికేషన్ యాప్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
ఇంటర్నెట్ అవసరం లేని మెసేజింగ్ ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేయాలంటే మొబైల్ డేటా లేదా వైఫై అవసరం. కానీ ఆఫ్‌లైన్ మెసేజింగ్ యాప్స్ మాత్రం బ్లూటూత్ లో ఎనర్జీ (BLE) టెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారా సమీపంలోని స్మార్ట్‌ఫోన్లు నేరుగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. ఒక యూజర్ పంపిన మెసేజ్ మొదట సమీపంలోని మరో ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా వెళ్తుంది. ఆ తర్వాత ఆ ఫోన్ మరో దగ్గరలోని ఫోన్‌కు ఆ మెసేజ్‌ను పంపిస్తుంది. ఇలా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు మెసేజ్ చేరుతూ చివరకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ విధానాన్నే మెష్ నెట్‌వర్క్ అని పిలుస్తారు.
బ్లూటూత్ మెష్ నెట్‌వర్క్ ప్రత్యేకత ఏంటి?
ఈ విధానంలో మెసేజ్‌లు మొబైల్ టవర్, వైఫై రూటర్, సెంట్రల్ సర్వర్ ద్వారా వెళ్లవు. ప్రతి స్మార్ట్‌ఫోన్ ఒక చిన్న రిలే పాయింట్‌లా పనిచేస్తుంది. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఒకే యాప్‌ను ఉపయోగిస్తే నెట్‌వర్క్ పరిధి మరింత పెరుగుతుంది. అయితే ఈ యాప్స్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా సమీప దూరాల్లోనే సమర్థంగా పనిచేస్తాయి. ఎక్కువ మంది యూజర్లు ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది.
బిచాట్ వంటి యాప్స్ ఎలా పనిచేస్తాయి?
ఆఫ్‌లైన్ మెసేజింగ్ యాప్స్‌లో బిచాట్ ఒక ప్రముఖ యాప్‌గా మారింది. ఇది ఫోన్ నంబర్, యూజర్ అకౌంట్, సెంట్రల్ సర్వర్ అవసరం లేకుండా బ్లూటూత్ ద్వారా మెసేజ్‌లు పంపుకునే అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి మరికొన్ని యాప్స్ కూడా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌లో పంపే మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. దీంతో ఇంటర్నెట్ లేకున్నా సమీపంలోని వ్యక్తులతో సమాచారాన్ని పంచుకోవచ్చు.
పోలీసులు ఎందుకు పరిశీలిస్తున్నారు?
ఢిల్లీలో నిరసనల సమయంలో ఇంటర్నెట్ సేవలు పరిమితం చేసిన తర్వాత కూడా కొందరు నిరసనకారులు ఇలాంటి యాప్స్ ద్వారా కమ్యూనికేట్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ యాప్స్ వినియోగంపై సమాచారం సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ ఆంక్షలు ఉన్న సందర్భాల్లో ఇలాంటి ఆఫ్‌లైన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గతంలో కూడా ఉపయోగించబడింది. హాంకాంగ్, ఉక్రెయిన్, నేపాల్ లలో జరిగిన నిరసనల్లో కూడా బ్లూటూత్ ఆధారిత మెసేజింగ్ యాప్స్ వినియోగంపై వార్తలు వచ్చాయి. ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా దగ్గరలోని వ్యక్తులతో సమాచార మార్పిడి చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్ కమ్యూనికేషన్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
