గండిపేట ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. శనివారం ( జూన్ 6 ) ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. ఈ క్రమంలో బ్రహ్మనాయుడును ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. నకిలీ పత్రాలు పెట్టి భూకబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణల క్రమంలో ఆయనకు అరెస్ట్ చేశారు పోలీసులు. జూన్ 20 వరకు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు బ్రహ్మనాయుడు.
అయితే... బ్రహ్మనాయుడును నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లే సమయంలో కాసేపు హైటెన్షన్ నెలకొంది. వైసీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించగా అడ్డుకున్నారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో సుమారు 104 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 10 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి తమదేనంటూ గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల రాజేశ్ గౌడ్, వేణుగోపాల్, రామస్వామి, మంగ అనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 2012లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిరుడు అక్టోబర్ 6న హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేస్తూ.. ఆ 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసింది.
►ALSO READ | హయత్ నగర్ లో మున్సిపల్ అధికారుల ముందే.... పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం...
కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ.. నిమ్మల కుటుంబ సభ్యులు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్ర పన్నారు. ఇందుకోసం ఏకంగా ప్రభుత్వం తమకే ఆ భూమిని కేటాయించినట్టు ఐదు నకిలీ జీవోలను సృష్టించారు. వాటిని వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ చేశారు. ఈ క్రమంలోనే భూమిని విక్రయించడానికి ఏపీకి చెందిన వినుకొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున కుదిరిన డీల్లో భాగంగా.. నిందితుల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే నుంచి నిమ్మల కుటుంబానికి రెండు విడతలుగా దాదాపు రూ.4 కోట్ల వరకు డబ్బు చేతులు మారినట్టు పోలీసుల విచారణలో తేలింది.
