ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు.. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు.. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

అమరావతి: ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. కొత్తగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో తోటి తెలుగు రాష్ట్రంలో ప్రజలు కలవరపాటుకు లోనవుతున్నారు. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బాపట్లలో ఒక కరోనా కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపి.. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కి చేరింది. 

ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ నలుగురు చనిపోయారు. చనిపోయిన నలుగురు కాకినాడ, గుంటూరు జిల్లాలకు చెందిన వారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం 20 రోజుల్లోనే 12 కేసులు నమోదు కావడంతో పాటు నలుగురు మరణించడంతో ఏపీలో కరోనా భయం పట్టుకుంది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లో తక్కువగానే ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్య శాఖ అధికారులు తెలిపారు. కానీ, శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో కరోనాతో వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. నేటి కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడం లేదని, తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం లేదని, అతిగా భయపడవలసిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు.