హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 44వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీకి తన వంతు సాయంగా రూ.50 వేలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు మంత్రి వివేక్. శనివారం ( జూన్ 6 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్.
ఈ సందర్భంగా సామాజిక సేవలు చేస్తున్న ఏపీ నందిగామ పోలీస్ స్టేషన్ ఎసై అభిమన్యు , ఇంటర్నేషనల్ సాఫ్ట్ బాల్ ప్లేయర్ ప్రవళిక లను మాజీ కేంద్ర మంత్రి డా. సముద్రాల వేణుగోపాలచారితో కలిసి మొమెంటోలతో ఘనంగా సన్మానించారు మంత్రి వివేక్.
అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ స్థాపించిన డాక్టర్ దేవసేన ఎంతో మంది పిల్లలకు భరతనాట్యం , కూచిపూడి నృత్యాలలో శిక్షణ ఇస్తూ , వారిని కళాకారులుగా తీర్చిదిద్దరని కొనియాడారు. సన్మాన గ్రహీతలు అయిన అభిమన్యు పోలీస్ వృత్తిలో కొనసాగుతూ ... సామాజిక సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రవళిక అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ , దేశానికి మరింత ప్రతిష్ట తీసుకురావాలి మంత్రి ఆకాంక్షించారు.
వేణుగోపాల చారి మాట్లాడుతూ... తమ జిల్లాకు చెందిన వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా పని చేయడం గర్వకారణం అని అన్నారు. అంబేద్కర్ విద్య సంస్థలను స్థాపించి విద్యతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు. నిరుద్యోగ యువతకు జర్మన్ భాష నేర్పించి , వారికి జర్మన్ దేశంలో ఉపాధి కల్పించడం చరిత్రలో ఏ కార్మిక శాఖ మంత్రి చేయలేదని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
