- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, సెర్ప్ సీఈవో,
- మెప్మా ఎండీ, స్త్రీనిధి ఎండీ, ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా దివ్య దేవరాజన్
- ఏశాఖకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితి
- ఈజీఎస్‌పై కొరవడిన పర్యవేక్షణ.. క్షేత్ర స్థాయి అటెండెన్స్‌లో గందరగోళం
- సెర్ప్, మెప్మా మెర్జ్ అయినా పరిష్కారం కాని సమస్యలు
- స్త్రీనిధిలో అస్తవ్యస్తం.. ప్రజావాణికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
- పీఆర్, ఆర్డీకి పూర్తిస్థాయి ఆఫీసర్‌ను కేటాయించాలనే డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కీలకమైన 5 శాఖల బాధ్యతలను ఒకే ఐఏఎస్ ఆఫీసర్‌కు అప్పగించడంతో ఫైళ్లు, పనులు పెండింగ్పడ్తున్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్, సెర్ప్ సీఈవో, మెప్మా, స్త్రీ నిధి ఎండీ, ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ప్రస్తుతం దివ్య దేవరాజన్ కొనసాగుతున్నారు. ఈ శాఖలన్నీ నేరుగా ప్రజలు, ముఖ్యంగా పేదలు, మహిళా సంఘాలతో సంబంధం ఉన్నవి. దివ్యాదేవరాజన్‌కు సమర్థవంతమైన అధికారిణిగా పేరున్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు పేరుకుపోతున్నాయని ఆయా శాఖల్లో చర్చ జరుగుతోంది.
ఈజీఎస్‌పై పర్యవేక్షణ కరువు..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంపై పర్యవేక్షణ లోపించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో హాజరు నమోదు విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నా.. సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని సర్పంచులు వాపోతున్నారు.
ఉపాధి హామీ స్కీమ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని తప్పనిసరి చేసింది. క్షేత్రస్థాయిలో సరైన సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ డౌన్‌లాంటి సమస్యలతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు.
యాప్ సర్వర్ బిజీగా ఉండడంతో ఉదయం పడాల్సిన హాజరు మధ్యాహ్నం దాటుతుండటంతో శ్రమ వృథా అవుతోందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడితేనే సమస్య కొలిక్కి వచ్చే చాన్స్ ఉంది. పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ఫీల్డ్ అసిస్టెంట్లు వారికి సంబంధిచిన వారు పనికి రాకపోయినా.. అటెండెన్స్ నమోదు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికితోడు త్వరలోనే పరిషత్ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో ఆ శాఖకు పూర్తి సమయం కేటాయించే అధికారి ఉంటేనే పాలన గాడిన పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక సెర్ప్, మెప్మా సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చినా.. అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఆఫీసర్‌కు తీరిక లేకపోవడంతో ఈ విషయంలో ముందడుగు పడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్త్రీ నిధి అస్తవ్యస్తం.. ప్రజావాణి పెండింగ్
మహిళా సంఘాలకు వెన్నెముకగా నిలవాల్సిన ‘స్త్రీ నిధి’ బ్యాంక్ అస్తవ్యస్తంగా మారింది. స్త్రీనిధి ఎండీగా పని చేసిన విద్యాసాగర్‌రెడ్డి రిటైర్‌అయ్యారు. ఆయన తర్వాత ఇన్‌చార్జిగా సెర్ప్ సీఈవో దివ్యకు బాధ్యతలు అప్పగించారు. లోన్ల మంజూరు, రికవరీలాంటి అంశాలపై ఫోకస్ చేయాల్సి ఉంది.
ఈ క్రమంలో ఇటీవల స్త్రీ నిధి రుణాలపై సూర్యాపేట జిల్లాలో సోషల్ఆడిట్నిర్వహించగా, రుణాలు దుర్వినియోగం అయినట్టు తేలింది. దీంతో అన్ని జిల్లాల్లో సోషల్ ఆడిట్ చేపట్టాలనే డిమాండ్వస్తోంది. కానీ, ఈ దిశగా నిర్ణయం తీసుకునేవారు లేరు. మరోవైపు సుదీర్ఘకాలం తర్వాత స్త్రీనిధిలో ఉద్యోగ నియమాక ప్రక్రియ కొనసాగుతోంది.
ఇలాంటి కీలక సమయంలో పూర్తిస్థాయి ఆఫీసర్ లేకపోతే ఎలాగనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’కి దివ్య నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. నోడల్ అధికారిగా ఆ దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది.
కానీ, 5 శాఖల నిర్వహణ కారణంగా ప్రజావాణికి తగినంత సమయం ఇవ్వకపోవడంతో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. అంతేకాదు, సెక్రటేరియెట్‌కు, క్షేత్ర పర్యటనలకు సమయం సర్దుబాటు చేసుకోవడం ఆ అధికారికి సవాల్‌గా మారింది. సెర్ప్ మినహా మిగిలిన అన్ని శాఖల్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయని, నిర్ణయాల్లో జాప్యం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది.
