- మట్టి పరీక్షలు లేక రైతులకు అవగాహన కరువు
- అటకెక్కిన సాయిల్ హెల్త్‌కార్డులు
- వాలంటీర్లను ఎంపిక చేసినా ఫలితం శూన్యం
- వానకాలం పంటల సాగుకు అన్నదాత సన్నద్ధం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: పంటల సాగులో కీలకమైన నేల స్వభావాన్ని తెలుసుకోవడం రైతులకు కష్టతరంగా మారింది. వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మట్టి పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో మట్టి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని వ్యవసాయ పరిశోధన శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.
సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలంటే భూమిలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకోవడం అవసరం. మట్టి నమూనాల సేకరణ కోసం వలంటీర్లను నియమించినప్పటికీ, పరీక్షల ప్రక్రియ ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే తమ భూములు ఏ పంటకు అనుకూలమో తెలియకుండానే సాగు పనులను ప్రారంభిస్తున్నారు.
భూస్వభావానికి పరీక్షలు అవసరం..
నేల స్వభావాన్ని తెలుసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టేందుకు ప్రభుత్వం జాతీయ భూఆరోగ్య నిర్వహణ పథకం ద్వారా రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి, రైతులకు సాయిల్హెల్త్ కార్డులు అందజేస్తారు. అయితే ఏటా నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిగా నెరవేరడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది 20 క్లస్టర్లలో 40 మంది వలంటీర్లతో మట్టి నమూనాల సేకరణ చేపట్టాలని ఆఫీసర్లు నిర్ణయించారు.
మొత్తం 3,400 మట్టి నమూనాలు సేకరించి 5,000 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. గతేడాది 6,500 మట్టి నమునాలు సేకరించినట్లు ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ, ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదికలో నామమాత్రంగానే నమునాలు సేకరించినట్లు వెల్లడైంది. వాటి ఫలితాలను కూడా రైతులకు తెలియజేయడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా భూసార పరీక్షలు నిర్వహించలేదు.
సాగుకు సిద్ధమవుతున్న రైతులు..
మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే రైతులకు పెట్టుబడి భారం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. అయితే ఈ ఏడాది పరీక్షలు ప్రారంభం కాకపోవడంతో రైతులు సాధారణ పద్దతుల్లోనే సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో వరి 1,09,854 ఎకరాలు, పత్తి 1,06,560 ఎకరాల్లో సాగు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
అలాగే మిరప, పప్పుధాన్యాలు, కూరగాయల సాగు కోసం రైతులు భూములను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో మట్టి నమూనాల పరీక్షలకు ప్రత్యేక ప్రయోగశాల లేకపోవడంతో వాటిని వరంగల్ లోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తరలించనున్నారు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో నేలలో తేమ శాతం అధికంగా ఉండటంతో మట్టి పరీక్షలు నిర్వహించడం కష్టమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది పరీక్షలు జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫలితం తెల్వక భారం..
భూమి స్వభావం తెలియకుండానే సాగు చేపట్టడంతో రైతులు అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. ముఖ్యంగా భాస్వరం నిల్వలు అధికంగా పేరుకుపోయి నేల సారాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో నేలలోని మిత్ర పురుగులు నశించిపోవడంతోపాటు భూమిలో లభ్యమయ్యే పోషకాలు కూడా నిరుపయోగంగా మారుతున్నాయని చెబుతున్నారు. భూసార పరీక్షల ఫలితాలు అందుబాటులో లేకపోవడంతో అధికంగా ఎరువులు వినియోగించి, ఆశించిన దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
