- ఎంపీ బండిసంజయ్ ఇంటి ఎదుట కాంగ్రెస్ ఆందోళన
- ప్రతిగా కర్రలతో దాడి చేసిన బీజేపీ.. తీవ్ర ఉద్రిక్తత
- హనుమకొండ, ఆదిలాబాద్, కొత్తగూడెంలోనూ ఘర్షణ వాతావరణం
కరీంనగర్/హనుమకొండ/భద్రాద్రికొత్తగూడెం/ఆదిలాబాద్, వెలుగు : రాహుల్ గాంధీ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీజేపీ కూడా బలప్రదర్శనకు దిగడంతో గందరగోళం నెలకొంది. కరీంనగర్, ఆదిలాబాద్ లలో బీజేపీ ఎంపీల క్యాంప్ ఆఫీస్ లను ముట్టడించేందుకు కాంగ్రెస్సిద్ధపడగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్లో బీజేపీ కార్యకర్తలు కూడా దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తదితరులు కార్ఖానాగడ్డలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎంపీ బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ కు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్ బోయిన్ పల్లి ప్రవీణ్ కుమార్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపై కర్రలు, చెప్పులతో దాడి చేశారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు బీజేపీ ఆఫీసు గేటును మూసి వేసి.. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీచార్జీ చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలతో పాటు లీడర్లు వెలిచాల రాజేందర్ రావు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సత్తు మల్లేశ్, వైద్యుల అంజన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ఆకుల నరసన్నను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలని మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించడాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఖండించారు.
ఆదిలాబాద్ ఎంపీ ఇంటి ముట్టడి
రాహుల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆఫీసు నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ నగేశ్ ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. విషయం తెలిసి పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు ఆడే గజేందర్, అల్లూరి సంజీవరెడ్డి, సాజిద్ ఖాన్, ఖిజార్ పాషా, రాజు యాదవ్ పాల్గొన్నారు.
హనుమకొండలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కాంగ్రెస్, బీజేపీ నిరసనలతో హనుమకొండలో టెన్షన్ నెలకొంది. రాహుల్ గాంధీ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ ఫొటోను దహనం చేయగా, సాయంత్రం బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. హనుమకొండ అశోక్ జంక్షన్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయగా.. వారిని హనుమకొండ పోలీసులు స్టేషన్ కు తరలించారు. కొందరు బీజేపీ నేతలు స్టేషన్ బయట నినాదాలు చేస్తుండగా.. అక్కడకు వచ్చిన యూత్‌కాంగ్రెస్ నేతలు రోడ్డుకు అవతలి వైపు నుంచి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేత చెప్పు చూపించడం వివాదాస్పదమైంది. రెండు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు. అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.
కొత్తగూడెంలో ఉద్రిక్తత
కాంగ్రెస్, బీజేపీల పోటాపోటీ నిరసనలతో బుధవారం కొత్తగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు బస్టాండ్‌సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగాయి. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బీజేపీ మహిళ కార్యకర్త చీరకు మంటలు అంటుకున్నాయి. అక్కడున్నవాళ్లు మంటలను ఆర్పివేశారు. కొద్దిసేపటికి అక్కడే ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు వస్తున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న కేంద్రం : మంత్రి పొన్నం ప్రభాకర్
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం ఆడుతోందని, పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం హనుమకొండలో నిర్వహించిన 'ఛాత్రోంకి గూంజ్'లో ఆయన మాట్లాడారు. లీకేజీకి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోకుండా విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ ఇతర నేతలను అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు.
ఎన్ టీఏ విశ్వాసాన్ని కోల్పోయింది : మంత్రి శ్రీధర్ బాబు
ఇబ్రహీంపట్నం, వెలుగు : జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్గూడాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కాలేజీలో బుధవారం చాత్రోంకి గూంజ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపాలని, ఈ అంశంపై ఉభయ సభల్లో చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలీద్, యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శ్యాంచరణ్ రెడ్డి పాల్గొన్నారు.
