వెలుగు ఓపెన్ పేజీ.. అమరుల స్వప్నం సాకారం

వెలుగు ఓపెన్ పేజీ.. అమరుల స్వప్నం సాకారం

తెలంగాణ... ఈ నాలుగు అక్షరాల పదం వెనుక ఎన్నో దశాబ్దాల త్యాగాలున్నాయి.  ఉరికొయ్యలను  నవ్వుతూ ముద్దాడిన ఎందరో  యువకుల  నెత్తుటి ధారలున్నాయి. స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు తమకు సొంతమవుతాయన్న ఆశతో ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుల బలిదానాల పునాదుల మీదే నేటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 

ఆ అమరుల ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి అని నమ్మిన నాయకుడు   ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ఈరోజు  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది అనడం కంటే, అమరుల ఆకాంక్షల ప్రభుత్వం నడుస్తోంది అనడం సబబు.  నీళ్ల కోసం తుమ్మడిహెట్టి,  కృష్ణా వాటాల కోసం పోరాడుతూ,  నిధుల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా తెలంగాణకు తెస్తూ,  నియామకాల్లో  తొలి ఏడాదే 70వేల ఉద్యోగాల్ని ఇచ్చి రాబోయే రోజుల్లో  పెద్ద ఎత్తున నియామకాలకు  బాటలు వేస్తూ...  తెలంగాణ  ఉద్యమకారులకు పెద్దపీట వేస్తూ,  అమరుల స్వప్నాన్ని  సాకారం చేస్తున్నది  రేవంత్ రెడ్డి పాలన.  

తెలంగాణ  రాష్ట్ర సాధన చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1969 నాటి తొలిదశ ఉద్యమం నుంచి 2014  మలిదశ ఉద్యమం వరకు కాంగ్రెస్ పార్టీ పాత్ర అనిర్వచనీయం.  తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అమరుల త్యాగాలను గుండెలకు  హత్తుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్.  దశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణ ఆకాంక్షను గౌరవించి, 2014లో  ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా  తీవ్ర నష్టం జరుగుతుందని, అధికారం కోల్పోతామని  అధిష్టానానికి స్పష్టంగా తెలిసినప్పటికీ  సోనియా గాంధీ వెనక్కి తగ్గలేదు.  

తెలంగాణ బిడ్డల ప్రాణాలు, వారి ఆత్మగౌరవమే ముఖ్యమని భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.  ఆనాడు అమరుల త్యాగాలను గౌరవించి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్,  ఈనాడు అదే అమరుల ఆశయాల సాధన కోసం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో అహర్నిశలు శ్రమిస్తోంది.

అమరుల విజయం

2023  డిసెంబర్ 3న  వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ  రాజకీయాల్లో  ఒక పెను మార్పునకు  నాంది పలికాయి.  ఆ రోజున  కాంగ్రెస్ పార్టీ చారిత్రక ఘన విజయం  కేవలం కాంగ్రెస్ పార్టీది కాదు,  ఇది తెలంగాణ అమరుల విజయం.  గత పదేళ్లలో  అమరుల కుటుంబాలు ఎదుర్కొన్న నిర్లక్ష్యాన్ని పారద్రోలి,  మాటలు  చెప్పడం కాదు చేతల్లో చూపించడమే నిజమైన నివాళి అని రేవంత్ సర్కారు నిరూపించింది. 2024 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. 

ఆ వేడుకలకు  ప్రభుత్వం ఎవరినో  కార్పొరేట్ పెద్దలను కాకుండా, సాక్షాత్తూ రాష్ట్రం కోసం  ప్రాణాలర్పించిన  సుమారు 650 మంది అమరవీరుల కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా, అత్యంత సాదరంగా ఆహ్వానించింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున  సముచిత  గౌరవం ఇచ్చి వేదిక మీద సత్కరించింది.  తమ బిడ్డలను కోల్పోయి గుండెకోతతో ఉన్న ఆ కుటుంబాలకు  ‘మేమున్నాం, ఈ ప్రభుత్వం మీది’ అని రేవంత్ ప్రభుత్వం కొండంత  భరోసా ఇచ్చింది.

ఉమెన్స్ కమిషన్ సభ్యురాలిగా..

తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన,  జేఏసీ  చైర్మన్‌‌గా కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చిన  ప్రొఫెసర్ కోదండరాంను  గత  కేసీఆర్​  ప్రభుత్వం ఎలా  అవమానించిందో అందరికీ తెలుసు. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి, ఎమ్మెల్సీగా సముచిత గౌరవం కల్పించింది.  ఇక మలిదశ ఉద్యమంలో తొలి బలిదానం చేసి,  తెలంగాణ నినాదాన్ని తన ప్రాణవాయువుగా మార్చుకున్న అమరుడు శ్రీకాంతాచారి త్యాగాన్ని ఎవరూ మరువలేరు. 

ఆ అమరుడి తల్లికి రాష్ట్ర ఉమెన్స్ కమిషన్​లో  సభ్యురాలిగా స్థానం కల్పించడం అత్యంత భావోద్వేగభరితమైన నిర్ణయం. ఇవే కాకుండా నాతో సహా  జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉద్యమకారులకు బాధ్యతలు అప్పగించారు, ఉద్యమంలో పాల్గొన్న అనేకమందికి  రాష్ట్రస్థాయి  కార్పొరేషన్ చైర్మన్లుగా,  పదవులు కేవలం పోరాట యోధులకు,  సామాన్యులకు దక్కేలా చూశారు.  అమరులు కలలు కన్నది కేవలం భౌగోళిక తెలంగాణ కాదు.  స్వేచ్ఛాయుతమైన,  వివక్ష లేని,  సామాజిక న్యాయంతో కూడిన రాష్ట్రం.  

ఈనాడు  రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్  ప్రభుత్వం అక్షరాలా అదే బాటలో నడుస్తోంది.  ఉద్యోగాల  కల్పనతో  యువతకు భరోసా,  వ్యవసాయ రంగంలో  రైతులకు అండగా నిలుస్తూ తెలంగాణ పునర్నిర్మాణానికి  ప్రాణం పోస్తోంది.  అమరుల త్యాగాలను ప్రతిక్షణం స్మరించుకుంటూ,  వారి కుటుంబాలను అక్కున చేర్చుకుంటూ ఒక బాధ్యతగల కొడుకుగా తన ధర్మాన్ని  నెరవేరుస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి.  మన కాంగ్రెస్ పాలనలో  తెలంగాణ  అమరుల కలలు నిజమవుతున్నాయి.  ఇది ఆత్మీయ పాలన.  అమరుల ఆశయాలతో  నడుస్తున్న నిజమైన 'ప్రజా పాలన'.

ఉద్యమకారులకే  పట్టం

అమరుల గుర్తింపు అనేది కేవలం సభల్లో చేసే  ప్రసంగాలకు  పరిమితం కాకుండా,  ఒక చట్టబద్ధమైన, అధికారిక ప్రక్రియ ద్వారా నిరంతరం కొనసాగాలని రేవంత్ రెడ్డి సంకల్పించారు.  అందులో  భాగంగానే 2025 మే 15న తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకమైన 'జీవో 679'ను  విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా అమరుల అధికారిక గుర్తింపు కోసం ఒక స్పష్టమైన, పారదర్శకమైన  విధివిధానాన్ని రూపొందిం
చింది.  

ఎవరైతే  నిజంగా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం  చేశారో,  వారిని వెతికి మరీ గుర్తించి,  వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలబడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య  అమరులపట్ల వారికున్న అచంచలమైన అంకితభావాన్ని చాటుతోంది.  రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని  సునిశితంగా  పరిశీలిస్తే  తెలంగాణ ఉద్యమకారులకే  పట్టం కట్టినట్లు  స్పష్టమవుతుంది.  తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన  నాయకులకు  మంత్రివర్గంలో  సముచిత స్థానం కల్పించారు.  

మంత్రులు  పొన్నం ప్రభాకర్,  కోమటిరెడ్డి  వెంకటరెడ్డి,  దామోదర  రాజనర్సింహ,  ఉత్తమ్​కుమార్ రెడ్డి వంటి వారు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కారు.  వీరంతా  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు లోపలా,  బయటా పోరాడినవారు,  ఉద్యమాన్ని  ముందుండి నడిపించినవారు.

పున్నా కైలాస్ నేత,డిసిసి అధ్యక్షుడు, నల్గొండ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.