రాష్ట్రంలో గత పాలకుల అండదండలతో సాగిన ‘అసైన్డ్’ భూముల దందాపై ప్రస్తుత ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ‘అసైన్డ్ పాలసీ’ని తీసుకువస్తామంటూ గత సర్కారు ఇచ్చిన లీకులను ఆసరాగా చేసుకుని, ధరణి పోర్టల్ రాకముందు.. ఆ తర్వాత పెద్ద ఎత్తున సాగిన భూబాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎన్నికల హామీ మేరకు అసైన్డ్ భూములకు ‘ఫ్రీహోల్డ్’ (యాజమాన్య హక్కులు) కల్పించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈలోపే రంగంలోకి దిగి నాటి అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు రట్టు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. పేదలకు దక్కాల్సిన వేల ఎకరాల భూములను కాజేసిన నేతల లావాదేవీల లెక్క తేల్చేందుకు సర్కారు సిద్ధమవడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.
5.36 లక్షల ఎకరాలకు డిజిటల్సైన్ కాలే
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వివాదాస్పదంగా మారిన, చట్టవిరుద్ధంగా బదలాయింపులు జరిగిన అసైన్డ్ ల్యాండ్స్‌ను తదుపరి లావాదేవీలు జరగకుండా రెవెన్యూ శాఖ నిషేధిత భూముల జాబితా (22-ఎ)లో చేర్చింది. తద్వారా విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా బ్రేకులు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 5.36 లక్షల ఎకరాలకు ఇంకా డిజిటల్ సైన్ కాలేదు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 1.77 లక్షలు, కామారెడ్డిలో 1.31 లక్షలు, మెదక్‌లో 1.49 లక్షలు, నల్గొండలో 1.41 లక్షలు, నిజామాబాద్‌లో 1.31 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. కాలక్రమేణా చాలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొందరు ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నా, వారికి భూమి లేదు. 2022 మే 6న వరంగల్‌లో జరిగిన రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోడు రైతులు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతోసహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వారి విషయంలో ఎంక్వైరీ చేసి ముందుకు !
రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమకు కేటాయించిన అసైన్డ్ భూములను కొన్నిచోట్ల అమ్ముకున్న అసలు లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోంది. ఇటువంటి వివాదాస్పద భూములపై కేవలం రికార్డులను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, క్షేత్రస్థాయిలో అసైన్డ్ దారులు ఇచ్చే ‘స్టేట్మెంట్స్’ (వాంగ్మూలాలు) ఆధారంగానే ముందుకు వెళ్లాలని రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది. ప్రస్తుతం సదరు భూమి అసలు కబ్జాలో ఎవరు ఉన్నారు? సదరు వ్యక్తులు ఎప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు? అనే పూర్తి స్థాయి వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని అధికారులు నిర్ణయించారు. నిరుపేద అసైన్డ్ దారులను మోసం చేసి భూములు గుంజుకున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేయడంతో పాటు, బలవంతపు కొనుగోళ్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలను వెలికితీసేందుకే ప్రభుత్వం ఈ లబ్ధిదారుల స్టేట్‌మెంట్ల సేకరణకు ప్రాధాన్యత ఇస్తోంది.
