- భద్రతాపరంగా నిర్లక్ష్యం చేసిన ప్రిన్సిపాల్‌కు 3 ఏండ్ల జైలు
- 2019లో జరిగిన ఘటనపై పోక్సో కోర్టు తీర్పు
మియాపూర్, వెలుగు : స్కూల్‌లో మూడున్నర ఏండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కరాటే మాస్టర్‌కు 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపాల్‌కు 3 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. మియాపూర్ దీప్తి శ్రీనగర్ లోని ఓ ప్రీ-ప్రైమరీ స్కూల్‌లో బాలిక(మూడున్నర ఏండ్లు) చదువుతోంది. 2019 జూన్ 20న స్కూల్ వ్యాన్ ఆలస్యంగా రావడంతో బాలిక ఒంటరిగా ఉంది. ఈ సమయంలో కరాటే, జిమ్నాస్టిక్స్ కోచ్ కిరణ్ సాయి చిన్నారిని భవనం పై అంతస్తులోని గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక కేకలు వేయడంతో పారిపోయాడు. మరుసటి రోజు చిన్నారి స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన విషయం బయటపడింది. దీంతో వారు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిరణ్ సాయి, స్కూల్ ప్రిన్సిపాల్ దీపికలను అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యాక కోర్టు కిరణ్ సాయికి 20 ఏండ్ల జైలు, రూ.20 వేల జరిమానా విధించింది. ప్రిన్సిపాల్ దీపికకు 3 ఏండ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్లు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. అలాగే బాధిత చిన్నారి కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
