- బంద్ పాటించాలంటున్న బీఆర్ఎస్.. అడ్డుకుంటామన్న బీజేపీ
- కరీంనగర్ ప్రశాంతతను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దెబ్బతీస్తున్నాయంటున్న కాంగ్రెస్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన శనివారం కరీంనగర్ బంద్ పిలుపుతో సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హింసా రాజకీయాలకు నిరసనగా వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌కు సహకరించి సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పిలుపునివ్వగా.. ప్రజా శ్రేయస్సులేని బీఆర్ఎస్ బంద్ కు ప్రజలెవరూ సహకరించవద్దని, బీజేపీ కార్పొరేటర్లంతా కలిసి తమ తమ డివిజన్లలోని వ్యాపార కూడళ్లపై వచ్చి వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాతావరణం కల్పిస్తామని మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు ప్రకటించారు.
అంతేగాక బీఆర్ఎస్ బంద్‌ను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలంతా శనివారం ఉదయమే రోడ్లపైకి రావాలని, బంద్ పేరుతో అరాచకాలు సృష్టించాలనుకునే బీఆర్ఎస్ ఆగడాలను అడ్డుకుందామని పిలుపునివ్వడంతో బంద్ సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఘర్షణ ఎటు దారితీస్తుందోనని నగరప్రజల్లో ఆందోళన నెలకొంది.
కాగా ఈ రెండు పార్టీలు కావాలని దాడి చేసుకుని బంద్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, వీళ్ల డ్రామాలతో ప్రజలు ఇబ్బంది పడాలా అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రాత్రి బంధుత్వం, ఉదయం శత్రుత్వంలా బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఉందన్నారు. రెండు పార్టీల నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని దాడులు చేసుకుని అందులో ఒక పార్టీ బంద్ కు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ కరీంనగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
