దోపిడీ చేసిన వాళ్లు తెలుసు.. కానీ నాకు సంబంధం లేదు

దోపిడీ చేసిన వాళ్లు తెలుసు..  కానీ నాకు సంబంధం లేదు
  •  పోలీస్‌‌‌‌‌‌‌‌ విచారణలో పీఎంజే జువెల్లరీ దోపిడీ సూత్రధారి సుబోధ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ 
  •     మరో ఇద్దరు నిందితులను విచారించిన పోలీసులు

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారి సుబోధ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇప్పటికే కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జైలులో ఉన్న రఘునాథ్‌‌‌‌‌‌‌‌ కర్మాకర్, రవీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో సుబోధ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ప్రధాన సూత్రధారి అని అనుమానించిన పోలీసులు బిహార్‌‌‌‌‌‌‌‌లోని పూర్నియా జైలులో ఉన్న అతడిని పిటీ వారెంట్‌‌‌‌‌‌‌‌పై కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జైలుకు తీసుకొచ్చారు. కోర్టు అనుమతితో బుధవారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని సాయంత్రం వరకు విచారించి మళ్లీ జైలుకు తరలించారు. వీరిని మరో మూడు రోజులు విచారించనున్నారు. 

పోలీసుల ప్రశ్నలకు పొడిపొడి సమాధానాలు

మొదటి రోజు విచారణలో సుబోధ్ సింగ్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. చాలా ప్రశ్నలకు తనకు తెలియదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న రఘునాథ్‌‌‌‌‌‌‌‌ కర్మాకర్, రవీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో ఇద్దరి ఫొటోలు చూపించగా.. వారిని జైలులో చూశానని, వారు తనకు తెలుసని చెప్పినట్లు సమాచారం. అయితే వాళ్లు చేసిన దోపిడీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. పారిపోయినవాళ్లు ఎక్కడ ఉంటారో తెలుసా అని అడుగగా... తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లు ఎత్తుకెళ్లిన బంగారం ఎక్కడ అమ్మేసి ఉంటారు ? వారికి పిస్టల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ? అనే ప్రశ్నలకు కూడా సుబోధ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ తనకు తెలియదనే సమాధానమిచ్చినట్లు సమాచారం.