కరీంనగర్/సిటీ, వెలుగు: కరీంనగర్ సిటీలోని మార్కెట్ పరిధిలోని రెండు షాపుల్లో మంగళవారం భారీగా కల్తీ కారం పొడి, పసుపు, ధనియాల పొడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు మార్కెట్ లోని గౌరిశెట్టి రమేశ్, సిద్ధంశెట్టి చక్రపాణి కిరాణం, సుగంధ ద్రవ్యాల దుకాణాల్లో మెరుపు దాడులు నిర్వహించి కల్తీ కారం, పసుపు, స్పైసెస్ నిల్వలను గుర్తించారు.
అనంతరం సుమారు 47 బస్తాల కారంపొడి , 2 బస్తాల పసుపు, ఒక బస్తా ధనియాల పొడిని స్వాధీనం చేసుకుని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డికి అప్పగించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆయా దుకాణాల నుంచి శాంపిళ్లు సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. ఈ ల్యాబ్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు స్టాక్‌ను పూర్తిగా సీజ్ చేస్తామని, సుగంధ ద్రవ్యాల అమ్మకాలపై పూర్తి నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్సైలు సురేందర్, శ్రీకాంత్ కానిస్టేబుల్ సాయిదీప్ పాల్గొన్నారు.
