కర్నాటక సీఎం పోస్టుకు సిద్ధూ రాజీనామా..! డీకేకు పదవి కట్టబెట్టాలని నిర్ణయించిన పార్టీ హైకమాండ్..

కర్నాటక సీఎం పోస్టుకు సిద్ధూ రాజీనామా..! డీకేకు పదవి కట్టబెట్టాలని నిర్ణయించిన పార్టీ హైకమాండ్..
  • ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న సిద్ధరామయ్య
  • ఢిల్లీలో 6 గంటలపాటు చర్చలు 
  • రాష్ట్రంలో సీఎం మార్పుపై మరోసారి తీవ్ర ఉత్కంఠ  

న్యూఢిల్లీ:కర్నాటకలో సీఎం పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు అగ్ర నేతల మధ్య సాగుతున్న పోరు ఎట్టకేలకు ముగిసిందా? డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​కు సీఎం సీటు అప్పగించేందుకు ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య అంగీకరించారా? అంటే ఢిల్లీ వర్గాలు అవుననే అంటున్నాయి. డీకేకు సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ హైకమాండ్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీఎం సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని, ఢిల్లీ నుంచి  జాతీయ స్థాయిలో మరింత పెద్ద పాత్ర పోషించాలని కోరారని తెలుస్తోంది. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధరామయ్య సమయం అడిగారని సమాచారం. 

సిద్ధరామయ్య ఈ విషయాన్ని తన అనుచరులతో చర్చించారని, తాను హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారని కూడా ఢిల్లీ వర్గాలు తెలిపాయి. సీఎం పదవి నుంచి దిగేందుకు అంగీకరించిన సిద్ధూ.. ఒకటి రెండు రోజుల్లో  రాజీనామా చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. 

మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఆరు గంటల పాటు సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. అయితే, కర్నాటకలోని మూడు రాజ్యసభ సీట్లకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించే ఈ సమావేశంలో చర్చించామని, సీఎం పదవి మార్పులో నిజంలేదని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీనిపై అనవసర ఊహాగానాలు చేయొద్దని మీడియాను కోరారు.

ఏడాది క్రితం నుంచే డీకే వర్గం డిమాండ్..  

కర్నాటక కాంగ్రెస్​లో ఈ నాయకత్వ సమస్య ఏడాదికిపైగా నలుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వం రొటేషన్ పద్ధతిలో 2.5 ఏండ్ల తర్వాత సీఎం పదవిని ఇచ్చేలా డీకేకు హామీ ఇచ్చిందని, ఆ వాగ్దానం ప్రకారం.. ఇప్పుడు డీకేకు సీఎం కుర్చీ అప్పగించాలని ఆయన అనుచరులు ఏడాదికిపైగా డిమాండ్ చేస్తున్నారు.

అయితే, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన తరగతులు, దళితులతో కూడిన అహిందా సమూహంలో సిద్ధరామయ్యకు ఉన్న మద్దతు దృష్ట్యా ఆయనను దింపేందుకు కాంగ్రెస్ తటపటాయించింది. సిద్ధూను దింపితే పక్క రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వొక్కలిగ లింగాయత్ వర్గం ఓట్లకు గండిపడుతుందని వాయిదా వేస్తూ వచ్చింది. 

ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కూడా ముగిసినందున సీఎం కుర్చీని ఇవ్వాల్సిందేనంటూ డీకే వర్గం మరింత బలంగా డిమాండ్ చేసిందని, దీంతో చివరకు హైకమాండ్ డీకేకు మద్దతు ఇచ్చిందని తెలుస్తోంది. మరోవైపు, సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారని, తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని వారు కోరినట్టు సమాచారం.