సిలిండర్ధర పెంపు వ్యవస్థీకృత దోపిడీ : ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్

సిలిండర్ధర పెంపు వ్యవస్థీకృత దోపిడీ : ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్
  • గ్యాస్ ధరలు పెరగవన్న ప్రధాని హామీ ఏమైంది?
  • ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్​ ఆగ్రహం

బెంగళూరు/కలబురగి:  కేంద్ర ప్రభుత్వం కమర్షియల్​ఎల్‌‌పీజీ సిలిండర్ ధరను అమాంతం పెంచడంపై కర్నాటక కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడ్డారు. ఇది వ్యవస్థీకృత దోపిడీ అని, శుక్రవారం కార్మిక దినోత్సవం నాడే ఈ భారాన్ని మోపడం ఏంటని ప్రశ్నించారు. కలబురగిలో మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ధరలు పెరగవని గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్​చేశారు. దేశాన్ని కష్టాల్లోకి నెట్టిన ఇలాంటి విధానాలను ప్రజలు ఇంకా ఎలా సమర్థిస్తున్నారో తనకు ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

సీఎం సిద్ధరామయ్య ఎక్స్​వేదికగా స్పందిస్తూ.. కమర్షియల్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.993 పెంచి, మొత్తం ధరను రూ. 3,071.50 కు చేర్చడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ధరలను పెంచకుండా ఆపి, ఓటింగ్ ముగియగానే భారాన్ని మోపడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని దుయ్యబట్టారు. కార్మిక దినోత్సవం నాడు కార్మిక వర్గానికి మోదీ ఇచ్చిన బహుమతి ఇదేనా? అని ప్రశ్నించారు. సామాన్యుల ఆదాయం తగ్గుతుంటే, ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఈ పెంపు వల్ల హోటళ్లు, చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిలిండర్ ధరను రూ.1,000 పెంచితే పేదలు  ఎలా బతకాలో ఉజ్వల యోజన పేరుతో ఫొటోలు దిగిన బీజేపీ నేతలు చెప్పాలన్నారు. ఈ పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతుండగా, కేంద్రం పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.