సర్కార్ స్కీం పెట్టిన చిచ్చు : రూ.2 వేల కోసం అత్తాకోడళ్ల కొట్లాటలు

సర్కార్ స్కీం పెట్టిన చిచ్చు : రూ.2 వేల కోసం అత్తాకోడళ్ల కొట్లాటలు

సర్కార్ వారి స్కీం..ఇళ్లల్లో చిచ్చు పెడుతుంది. అత్తా కోడళ్ల మధ్య గొడవలు, కొట్లాటలకు దారి తీస్తుంది. ఇది ఏ ఒక్క ఇంట్లోనో జరుగుతున్నది కాదు..రాష్ట్రంలో వేలాది ఇళ్లల్లో ఇప్పుడు అత్తా కోడళ్లు కొట్టుకుంటున్నారు. ఇదంతా జరుగుతున్నది కర్నాటక రాష్ట్రంలో. కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గృహ లక్ష్మి అనేది పథకం అమలు చేయబోతున్నది. ఈ పథకం కింద కుటుంబంలోని మహిళకు ప్రతినెలా 2 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు.

నాకంటే..నాకు అంటూ వాదనలు..

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఆ పార్టీ గెలిచి అధికారం చేపట్టింది. త్వరలో ఈ పథకం అమలు చేయబోతున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కుటుంబంలోని ఒక్క మహిళకు మాత్రమే 2 వేల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి కుటుంబాల్లోని అత్తా కోడళ్లు.. నాకు కావాలంటే నాకు కావాలంటూ గొడవలు పడుతున్నారు. ప్రభుత్వానికి నా అకౌంట్ నెంబర్ ఇవ్వండి అంటే నా నెంబర్ ఇవ్వండనీ ఇళ్లల్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇవి ఏ ఒకటీ అరా ఇళ్లల్లో కాదంటా.. వేల కుటుంబాల్లో ఇప్పుడు గృహ లక్ష్మి చిచ్చు పెట్టిందంట..

మంత్రి ఎవరికి సపోర్ట్..

గృహ లక్ష్మీ పథకంతో  అత్తా , కోడలు మధ్య గొడవలు మొదలైన నేపథ్యంలో కర్ణాటక మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ మాత్రం అత్తకే సపోర్ట్ చేశారు. గృహ లక్ష్మి  పథకం కింద వచ్చే డబ్బు అత్తగారికే చెందుతున్నారు. ఎందుకంటే  భారతీయ సంప్రదాయం ప్రకారం అత్తకే ఇంపార్టెన్స్ ఎక్కువన్నారు. కాబట్టి గృహలక్ష్మీ నగదు అత్తకే చెందుతుందని చెప్పారు. ఒకవేళ అత్తకు ఇష్టమైతే తన కోడలుతో డబ్బు పంచుకోవచ్చని హెబ్బాల్కర్ తెలిపారు. PWD మంత్రి  సతీష్ జార్కిహోళి కూడా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌తో ఏకీభవించారు.  అత్త  కుటుంబ పెద్ద కాబట్టి డబ్బు అత్తగారికి వెళ్లాలన్నారు. 

సగం..సగం..

కర్ణాటక మంత్రుల ప్రకటన ఒకలా ఉంటే...ఆ రాష్ట్రంలోని  మహిళా కార్యకర్తల వాదన మరోలా ఉంది. గృహ లక్ష్మీ నగదును అత్తకు, కోడలుకు సమానంగా పంచాలని అభిప్రాయపడుతున్నారు. కుటుంబ పెద్ద ఎవరు అన్నది ముఖ్యం కాదని....స్కీమ్ మొత్తాన్ని ఎవరు పొందాలో ఎంపిక చేయడం కష్టమంటున్నారు. కాబట్టి ఇంట్లో అత్తా కోడళ్లు ఉంటే..గృహలక్ష్మీ పథకం నగదును ఇద్దరికి పంచివ్వాలని సూచిస్తున్నారు.